తెలంగాణలో అసెంబ్లీ రద్దు అవుతుందనే ఒక స్థాయి నమ్మకం తెరాస నేతలకు దాదాపుగా వచ్చేసిందనే చెప్పాలి..! ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ దిగ్విజయం అయిందనీ, త్వరలో ఎన్నికలకు వెళ్లడమే అనే సందడి తెరాస వర్గాల్లో ఉంది. ముందుగా మంత్రి వర్గం సమావేశం ఉంటుంది. ఆ తరువాత, ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకుంటే… అసెంబ్లీలో తీర్మానించాల్సి ఉంటుంది. సహజంగా తెరాసకు మెజారిటీ ఉంటుంది కాబట్టి… తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించడం జరిగిపోతుంది. ఆ తరువాత, దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ నరసింహన్ కు అందించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఆయన పాత్ర మొదలౌతుంది..! కానీ, అంతకంటే ముందే… గవర్నర్ సంసిద్ధం అవుతున్నట్టు సమాచారం.
ఈ సమయంలో గవర్నర్ ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలరు అనే అంశంపై నరసింహన్ న్యాయ, రాజ్యంగ నిపుణులతో సంప్రదింపులు మొదలుపెట్టారని సమాచారం. వాస్తవానికి, ఈ సందర్భంలో సొంతంగా వ్యవహరించే అవకాశం గవర్నర్ కు లేదు. కేబినెట్ మెజారిటీ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిందే. మహా అయితే, మెజారిటీ ఉన్నప్పుడు కూడా అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారని మాత్రమే గవర్నర్ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దానికి ఎలాగూ తెరాస దగ్గర ఒక స్టాండర్డ్ సమాధానం అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా.
అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసిన వెంటనే, గవర్నర్ ప్రిపరేషన్స్ ప్రారంభించినట్టు కథనాలు రావడం! నిజానికి, కేసీఆర్ ఢిల్లీ వెళ్లిందే ముందస్తు ఎన్నికలపై స్పష్టత కోసం. ఆయనకి చాలా స్పష్టతే వచ్చిందని తెరాస వర్గాలూ అంటున్నాయి. దానికి అనుగుణంగానే గవర్నర్ నరసింహన్ కూడా నిపుణుల సలహాలూ సంప్రదింపులూ అంటున్నారు. అంటే, కేంద్రం నుంచి కూడా తెలంగాణ ముందస్తుకు ఏవైనా సానుకూల సంకేతాలు వచ్చాయా అనే అనుమనాలు బలపడుతున్నాయి. అలాంటివేవీ లేనప్పుడు…. గవర్నర్ ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారనేది అభిప్రాయం వ్యక్తమౌతోంది. నిజానికి, కేసీఆర్ ఢిల్లీ టూర్ కి వెళ్లక ముందే నరసింహన్ ను కలుసుకున్నారు. అసెంబ్లీ రద్దు విషయమై గవర్నర్ తో చర్చించే ఉంటారనే ఊహాగానాలు అప్పుడు వినిపించాయి. మొత్తానికి, అసెంబ్లీ రద్దు చేయడానికి కేసీఆర్ సిద్ధపడిపోతున్నారనే వాతావరణం ప్రస్తుతానికి నెలకొంది. కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పడ్డట్టే కనిపిస్తోంది. మరి, కేసీఆర్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో వేచి చూడాలి.