తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆయన అడిగింతే తడవుగా బీజేపీ ముఖ్యనేతలంతా అపాయింట్మెంట్లు ఇచ్చి చర్చోపచర్చలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినా… రాజకీయాలు చర్చించకుండా భేటీలు జరుగుతాయని ఎవరూ అనుకోరు. ఈ క్రమంలో కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే… బయటకు వచ్చిన ఓ లీక్ … గ్రేటర్ మేయర్ పీఠం బీజేపీకి… డిప్యూటీ మేయర్ పీఠం టీఆర్ఎస్కు ఇచ్చేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం చేసుకోవడం. ఈ మేరకు ఆఫర్‌ను బీజేపీ అగ్రనాయకత్వానికి కేసీఆర్ ఇచ్చారని… చెబుతున్నారు. అయితే ఈ ఆఫర్‌పై బీజేపీ స్పందనేమిటో మాత్రం స్పష్టత లేదు.
గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. టీఆర్ఎస్సే అతి పెద్ద పార్టీగా ఉంది. టీఆర్ఎస్ ఒక్క మాట అడిగితే.. మద్దతివ్వడానికి ఎంఐఎం రెడీగా ఉంది. కానీ.. ఎంఐఎంతో పెట్టుకుంటే అది రాజకీయంగా బ్లండర్ అవుతుందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. ఇప్పటికే బీజేపీ ఏకు మేకైపోయింది. ఇప్పుడా పార్టీని కంట్రోల్ చేయాలంటే… ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలనే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. అఘమేఘాలపై ఆయన ఢిల్లీ వెళ్లారన్న చర్చ కూడా జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల వరకూ బీజేపీపై ఆయన యుద్ధం ప్రకటించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఇక కత్తిదూసుడే అనుకున్నారు. కానీ ఇప్పుడు శాలువాలు కప్పుతున్నారు. అందుకే ప్రస్తుత చర్చ అంతా నడుస్తోంది.
తెలంగాణ బీజేపీ నేతలు… టీఆర్ఎస్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే.. ఇప్పుడు వారి పార్టీ ప్రత్యామ్నాయశక్తిగా ప్రజల ముందు ఉంది. అదే హైకమాండ్ ఆలోచన ఏమిటో మాత్రం స్పష్టత లేదు. జాతీయరాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ను దగ్గరకు తీసే చాన్స్ కొంత ఉంది. రాజ్యసభ సభ్యుల అవసరం.. ఇటీవలి కాలంలో ఎన్డీఏలో తగ్గిపోయిన మిత్రపక్షాలు.,. లాంటికారణాలతో.. టీఆర్ఎస్తో కలిసిమెలిసి తిరగడానికి బీజేపీ హైకమాండ్‌కు ఓ కారణం ఉందంటున్నారు. కానీ అలా చేస్తే.. తెలంగాణలో ఊపు వచ్చిన పార్టీకి సొంతంగా నష్టం చేసుకున్న వారవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా బీజేపీ పై యుద్ధం ప్రకటించి… ప్రాంతీయ పార్టీల నేతల్లాంటి భేటీలు నిర్వహిస్తే.. ఆయన చర్చలు విఫలమయ్యాయని అనుకోవచ్చు. బీజేపీ టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉండటానిక అంగీకరిస్తే.. రేపోమాపో… వ్యవసాయ చట్టానికి మద్దతుగా కేసీఆర్ మాట్లాడే మాటలు .. తెలుగు ప్రజలు వినొచ్చు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సారాంశం.. ఇలాగే బయటపపడే అవకాశం ఉంది.