పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తామని నిర్మాతలు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే మే 9న ఈ సినిమా విడుదల కావడం కష్టమే అన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఎందుకంటే పవన్ పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించాల్సివుంది. అందుకోసం కనీసం వారం రోజులైనా కాల్షీట్లు కావాలి. ఇప్పటికే ఏప్రిల్ లో సగం రోజులు అయిపోయాయి. ఆ వారం రోజుల షూటింగ్ కోసం పవన్ ఎప్పుడు డేట్లు ఇస్తాడో తెలీదు. షూటింగ్ అయితే సరిపోదు కదా, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగాలి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతీ షాట్… సీజీతో ముడి పడి ఉంటుంది. అదంతా ఆషామాషీగా తేలే వ్యవహారం కాదు.
ఇన్ సైడ్ వర్గాల టాక్ ఏమిటంటే… పవన్ నటించాల్సిన సీన్ లేకుండానే సినిమాని పూర్తి చేసేస్తున్నార్ట. ఆ సీన్ పక్కన పెట్టి, సినిమాని ముగిస్తే పరిపూర్ణత వస్తుందా, అతుకుల బొంతలా ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. షూటింగ్ కోసం డేట్లు ఇవ్వమని ఒత్తిడి తీసుకొచ్చే పొజీషన్లో నిర్మాత కానీ దర్శకుడు కానీ లేరు. పవన్ ఇస్తే మహాభాగ్యం. అనుకోవాలి.. అంతే. పైగా పవన్ చిన్న కుమారుడు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురయ్యి గాయాల పాలయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ని షూటింగ్ కి రమ్మనడం కూడా భావ్యం కాదు.
మే 9న ఈ సినిమా రావాలంటే తీయాల్సిన ఆ సీన్ పక్కన పెట్టాలి. లేదంటే.. మరో డేట్ చూసుకోవాలి. మళ్లీ వాయిదా అంటే ఆ భారం నిర్మాత మోయడం కష్టం. కాబట్టి మొదటి ఆప్షనే ఎంచుకొనే అవకాశం ఉంది.