14… ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న రేవంత్.. తనదైన పంచ్ డైలాగ్ లతో హీట్ పుట్టిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు హెచ్చరికలు, సవాళ్ళను విసురుతూ పార్టీలో ఎన్నికల జోష్ నింపుతున్నారు.
2 లక్షల రైతు రుణమాఫీ డిసెంబర్ 9నే చేస్తామని ఇంకా చేయకపోవడంతో అదే తమకు ఓట్లు తెచ్చి పెడుతుందని బీఆర్ఎస్ , బీజేపీలు భావించాయి. వీటిని ముందుంచి లోక్ సభ ఎన్నికల రాజకీయం చేయాలనుకున్నారు కానీ, ప్రతిపక్షాలకు రేవంత్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆగస్ట్ 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇచ్చేశారు. తమకు నమ్మకం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు…ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా..? అని రేవంత్ కు సవాల్ విసిరారు.
తప్పకుండా పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. డెడ్ లైన్ లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తావా.. ? అని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు. దీనిపై ఇంకా హారీష్ రావు స్పందించలేదు కానీ, రేవంత్ ప్రతి సవాల్ మాత్రం బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు… రేవంత్ డైలాగ్ లే కాంగ్రెస్ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చుతాయనే తాజాగా విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధుపై అతిగా ప్రచారం చేసుకొని నష్టపోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేయాలనుకొని రుణమాఫీపై స్పందించింది. కానీ అది భూమ్ రాంగ్ అయిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే రోజుల్లో రైతుబంధు వేసి రైతుల మెప్పును పొందాలనుకుంది బీఆర్ఎస్. రైతుబంధు విడుదలకు అనుమతి రావడంతో ఈ విషయంపై బీఆర్ఎస్ ముఖ్యంగా హరీష్ రావు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రైతుబంధు విడుదలకు ఈసీ బ్రేకులేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా రైతుబంధుపై బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడంతో రైతుబంధు నిలిచిపోయిందని రేవంత్ ఎదురుదాడి చేశారు. ఏదీ ఏమైనా ఇది బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం చేసిందని… కేసీఆర్ కూడా హారీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం కూడా జరిగింది.
ఇప్పుడు అదే తరహాలో లోక్ సభ ఎన్నికల ముంగిట రుణమాఫీపై సవాల్ చేసి రేవంత్ రాజకీయానికి హరీష్ డిఫెన్స్ లో పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రబుల్ షూటర్ గా పేరున్న హారీష్ బీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ మేకర్ గా మారుతున్నారా..? అనే చర్చ ఆ పార్టీలో మొదలైంది.