కొత్త రాష్ట్ర్రాన్ని ఓ దారిలోపెట్టడానికి ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి అవసరం. చంద్రబాబు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం అనే తొలిసవాలుతో పాటు ఇంకా అనేక చికాకులు చుట్టుముడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కొందరు టీడీపీ నేతల భూ దందాపై సాక్షి మీడియా కథనాలు డిఫెన్స్ లోకి నెట్టాయి. ఓ వైపు సుజనా చౌదరి వివాదం, మరోవైపు మంత్రి రావెల తనయుడి బాగోతంతో ఏపీ అధికార పార్టీ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది.
భూదందా విషయంలో ఇంకా సాగదీయకుండా వెంటనే సీబీఐకి కేసును అప్పగించడం వ్యూహాత్మకంగా సరైన చర్య అవుతుందంటున్నారు పరిశీలకులు. ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు నిష్ఫక్ష పాతంగా విచారణకు మేము సిద్ధమన సంకేతం ఇవ్వడం ద్వారా జగన్ తమపై దాడి చేయకుండా చెక్ పెట్టవచ్చు. రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. తన పార్టీలో రియల్ వ్యాపారులు ఎందరో, దందాలు చేసే వారు ఎవరో చంద్రబాబు కచ్చితంగా తెలిసే ఉంటుంది. కాబట్టి, అప్పుడే తమ రియాల్టీ విద్యను ప్రదర్శించ వద్దని, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తేవద్దని ముందే కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. రైతులు మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇస్తే, టీడీపీ వ్యాపారులు దందాలు చేస్తున్నానే విమర్శలు రావడం ఏ రకంగా చూసినా మంచిది కాదు.
మరోవైపు, సుజనా చౌదరి విషయంలో ఏం చేయాలనే దానిపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఐదు నెలల్లో 100 కోట్లు చెల్లిస్తారా లేదా అనేది వేరే విషయం. స్వయంగా చట్టాలు చేసే ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. ఆయన బడా వ్యాపారి అనేది అందరికీ తెలుసు. పైగా చాలా కాలంగా వివాదం ఉంది. కాబట్టి తన పరువు, పార్టీ పరువు పోయే పరిస్థితి రాకుండా లావాదేవీలు, చెల్లింపులు పక్కాగా ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు గట్టిగా హితవు చెప్పారో లేదో తెలియదు.
తాజాగా మంత్రి రావెల తనయుడు ఓ యువతిని వేధించిన కేసులో అరెస్టయ్యాడు. చిన్న విషయం అనుకున్నది కాస్తా పెద్ద కేసుగా మారింది. ఏకంగా నిర్భయ చట్టంలోకి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో నేరానికి ఆధారాలు లేకపోయినా, ఆయన కారు మాత్రం ఆ యువతిని వెంబడిస్తున్నట్టు స్పష్టంగా ఉంది. ఆమె భయంతో వడివడిగా నడవడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏదో జరిగి ఉంటుందనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఈ వ్యవహారం కూడా టీడీపీకి, ప్రభుత్వానికి మచ్చతెచ్చేదే.
ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి చికాకులు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా పనిచేసుకుంటున్నారు. పార్టీలో ఎదురు లేదు. అనవసర వివాదాలు లేవు. మంత్రుల తనయుల పోకిరీ వేషాల విమర్శలు లేవు. ప్రతిపక్షం చాలా వరకు బలహీన పడింది. అటు ఏపీలో మాత్రం చంద్రబాబు తడబాటుకు గురవుతున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. పరిపాలనపై, పార్టీపై చంద్రబాబుకు పట్టు ఉందా లేక తన పట్టు కోల్పోయారా అని చాలా మందికి అనుమానం కలుగుతోంది. ఇక ముందైనా వివాదాలకు తావివ్వకుండా ప్రజల మెప్పు పొందేలా పనిచేయకపోతే ప్రతిపక్షం చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టు అవుతుంది. ఇది చంద్రబాబుకు తెలిసే ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పార్టీ శ్రేయోభిలాషులు, కొందరు సీనియర్ నేతలు.