కొన్ని ఫోటోలు ఎప్పటికీ చైతన్యం కలిగిస్తూనే ఉంటాయి. చూసినవారు మళ్ళీ చూసినా, ఎవరైనా మనకు చెబుతున్నా స్ఫూర్తి చెందుతుంటాము. ఫేస్ బుక్ ద్వారా Do Something అకౌంట్ నుంచి వైరల్ లా వ్యాపిస్తున్న ఈ ఫోటో గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా అది తప్పుకాదు.
ఈ ఫోటో చూడగానే జింకను రక్షించిన వ్యక్తే `రియల్ బాహుబలి’ అన్న ఫీలింగ్ రాకమానదు. బాహుబలి చిత్రంలో శివగామి చిన్నారి శివుడ్ని రక్షించుకోవడంకోసం నదీప్రవాహంలో కొట్టుకుపోతూకూడా, చంటిపిల్లాడ్ని చివరివరకూ రక్షించాలన్న ఏకైక తపనతో బాలుడ్ని ఒకచేత్తో పైకిలేపి ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడేప్రయత్నం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. అయితే, అదంతా సినిమా. అక్కడ శివగామి పాత్రధారి చేతులతో పైకెత్తింది సజీవంగా ఉన్న బాలుడుకాదు. అదో బొమ్మ.
కానీ, ఇది నిజం. చిట్టి జింకను వరదనీటి నుంచి రక్షించే ప్రయత్నం చేసిన పిల్లాడిపేరు బెలాల్. ఈ ఫోటో తీసిన వ్యక్తితోసహా, ఎంతో మంది ఒడ్డున నిలబడి జింకపిల్ల నీళ్లలో కొట్టుకుపోవడం చూస్తూనే ఉన్నారు. అంతలో సాహసబాలుడు నీళ్లలోకి దూకి జింకపిల్లను మునిగిపోకుండా అచ్చు బాహుబలి చిత్రంలో శివగామి చేసినట్టుగానే ఒంటి చేత్తో జింకపిల్లను పైకిలేపి తననుతాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు.
సామాజికమధ్యమంలో షికారు చేస్తున్న ఈ ఫోటో ఇప్పటికే కోట్లాదిమంది హృదయాలను కదిలించింది. మానవత్వం ఇంకిపోతున్న ప్రస్తుతకాలంలో వన్యప్రాణిని రక్షించాలని తపనపడ్డ బెలాల్ యాదార్థఘటన మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి.
ఈ భూమిమీద జీవించే హక్కు మానవుల సొంతంకాదు. పుట్టిన ప్రతిజీవికి ఉన్న హక్కు ఇది. లక్షలకోట్ల జీవరాశితో కలసిమనం జీవిస్తున్నామన్న సహజీవన భావన పెరగాలి. అప్పుడే ఇలాంటి కరుణభావం ఏర్పడుతుంది.
నిజంలేదా !
ఇది యాదార్థసంఘటన అనీ, బంగ్లాదేశ్ లోని అడవిప్రాంతంలో నదీప్రవాహం పోటెత్తినప్పడు ఒక జింకపిల్ల నీటిలో మునిగిపోతుంటే ఒక కుర్రాడు దాన్ని ఇలా రక్షించాడని అంటున్నారు. అయితే, ఇదంతా కావాలని తీసిన పోటోఅనీ, అప్పటికే బాహుబలి పోస్టర్ (శివగామి- చంటిపిల్లాడు) చిత్రం చూశాక కావాలని ఎవరో ఇలా ఫోటోతీసి సోషల్ మీడియాలో పెట్టారని కొంతమంది పెదవివిరుస్తున్నారు.. నిజానికి ఫోటోగ్రాఫర్ అక్కడే ఉండిఉంటే, మరి బెలాల్ బయటకు వచ్చాడా లేక మునిగిపోయాడా అన్నది చిత్రీకరించాలి కదా… అలా జరగలేదు కాబట్టి ఇదంతా ఫేక్ అనే వారున్నారు. అయితేనేం, ఈఫోటో ఇంతగా స్ఫూర్తిఅందిస్తున్నప్పుడు సంఘటన నిజంగా జరిగిందా, లేక ఫ్యాబ్రికేటెడా అన్నది అప్రస్తుతం. సినిమాలోని ఒక దృశ్యం లేదా ఒక ఫోటో ఇలా ఏదైనప్పటికీ సమాజంలో ఆలోచనలు నింపినప్పుడు కోడిగుడ్డుమీద ఈకలు పీకడం సరైనధోరణికాదు.
ఈ పిల్లాడెవరు?
యాదార్థసంఘటన అని చెపుతున్నప్పుడు ఆ బాలుడు (బెలాల్) ఎక్కడున్నాడు ? అతను మళ్ళీ ఎవరికీ ఎందుకుకనబడలేదు? అన్న అనుమానాలు పొడచూపుతున్నాయి. ఈ పిల్లాడు బంగ్లాదేశ్ లో బెంగాల్ టైగర్స్ కు ఆనవాలమైన సుందర్బన్ అటవిలోని ఒక గ్రామానికి చెందినవాడని అంటున్నారు. అక్కడి వారు వన్యప్రాణులు మరీ ముఖ్యంగా సాధుజంతువులపట్ల కరుణ చూపిస్తారు. చిన్నప్పటినుంచి వాటిని రక్షించడంలో ముందుంటారు. అలాగే బెలాల్ ఈ జింకపిల్లను రక్షించాడని అంటున్నారు. ప్రాణులపట్ల ఆదరణ చూపాలన్న విషయంలో అతను అందరికీ మార్గదర్శి అయ్యాడనీ, అతనెవరో గుర్తించి రివార్డ్ లూ, అవార్డులూ ఇవ్వాలని కొందరు గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ, ఆ కుర్రాడు తర్వాత కనిపించలేదనీ, అడవిలోకి వెళ్లిపోయారని కథనాలు వినబడుతున్నాయి. ఈ కుర్రాడు జింకను చంపితినడంకోసమే దీన్ని రక్షించిఉంటారన్న వాదనను పైకిలేపారు. తినడానికే దాన్ని రక్షించాడనుకోవడం తప్పేఅవుతుంది. ఎందుకంటే, ఆ భావన ఉన్నవాడు జింకపిల్లను ఎంతో ప్రేమగా (తాను మునిగిపోతున్నా, జింకను పైకిలేపి ఉంచేటంతటిప్రేమగా) రక్షించినవాడు, తినడానికి అన్నవాదన నమ్మశక్యంగాలేదు. మరో విషయం ఏమంటే, బంగ్లాదేశ్ ఆటవిక గ్రామాల ప్రజలు ఎక్కువగా వెజిటేరియన్స్ అనీ,వారు మాంసం ముట్టుకోరని కొందరనడాన్నిబట్టి ఈ పిల్లాడు జింకపిల్లను రక్షించేందుకే సాహసం చేశాడనుకోవచ్చు.
ఒకవేళ, అడవి ప్రాంతంలో మాంసం తినాలనుకంటే వారికి జంతువుల కొదవేమీఉండదుకదా… అలాంటప్పుడు నీళ్లలో మునిగిపోతున్న జింకపిల్లనే బయటకుతీసుకువచ్చి తినేయాలని ఎవ్వరైనా అనుకుంటారా? కేవలం మాంసంకోసమే తాను మునిగిపోతున్నా లెక్కచేయకుండా జింకను రక్షించాడవాదనలో పసలేదు. కనుక ఈ సంఘటన యాదార్థమే అయిఉంటే, తప్పకుండా మానవాళి అతణ్ణి అభినందించాల్సిందే. మానవతకు అద్దంపట్టిన ఈ ఫోటోను స్ఫూర్తిదాయక చిత్రంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాకాదూ, ఇది ఫ్యాబ్రికేటెడ్ ఫోటో అని అనుకున్నా, స్ఫూర్తిగా నిలిచినందుకు మెచ్చుకోవాలి. మరో విషయం ఏమంటే, సోషల్ మీడియా ఎంత యాక్టీవ్ గా ఉన్నదన్నది కూడా ఈసంఘటన చెబుతోంది.
– కణ్వస