కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే.. ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించనున్నాయి. అందుకే.. కర్ణాటకలో ఎవరు గెలుస్తారనే చర్చ.. ఇప్పుడు దేశమంతా నడుస్తోంది. అందుకే జాతీయ మీడియాగా పేరు పడిన చానళ్లు అన్నీ ఓపీనియన్ పోల్స్ పేరుతో ప్రజాభిప్రాయాన్ని ముందుగానే వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాయి. మరే దక్షిణాది రాష్ట్రంలోనూ లేని విధంగా అక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇది కూడా.. జాతీయంగా కర్ణాటక ఎన్నికలపై ఆసక్తి పెరగడానికి మరో కారణం.
ఇప్పటి వరకు.. చూస్తే..కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందన్న ఉహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీకి తగ్గ రాజకీయాలతో సిద్ధరామయ్య.. వారి వ్యూహాలను చిత్తు చేస్తున్నాడన్న అభిప్రాయం అందరిలో ఉంది. మొదట్లో కొంత ఉత్సాహంగా కనిపించిన బీజేపీ.. ఆ తర్వాత డీలా పడినట్లయింది. మొదట్లో.. గాలి జనార్ధన్ రెడ్డి వంటి నేతలుకు తమ పార్టీలో స్థానం లేదని చెప్పుకొచ్చిన అమిత్ షా.. ఇప్పుడు.. మూడు జిల్లాలను గాలి జనార్ధన్ రెడ్డికే అప్పగించేశారు. గాలి ఒక్కరే నేరుగా పార్టీలో చేరలేదు. కానీ బీజేపీ జెండాను పట్టుకుని ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ.. బీజేపీ దుస్థితికి అద్దం పడుతున్నాయని .. కర్ణాటక ఎన్నికలను పరిశీలిస్తున్న వారంటున్నారు.
ఓ వైపు అమిత్ షా ప్రచారం తేలిపోవడం… మరో వైపు… ప్రచారానికి మోదీ వెనుకడుగు వేస్తూండటం… కాంగ్రెస్ ను ఆనందానికి గురి చేస్తోంది. అయితే లెటెస్ట్ గా వస్తున్న ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ సంతోషపడే అంత పరిస్థితిలేదని వెల్లడవుతోంది. టైమ్స్ నౌ, ఏబీపీ -సీఎస్డీఎస్ సంస్థలు నిర్వహించిన ఓపీనియర్ పోల్స్ లో కర్ణాటకలో హంగ్ ఖాయమన్న అంచనాలు వెలువడ్డాయి. కింగ్ మేకర్ గా దేవేగౌడ పార్టీ జేడీఎస్ నిలవడం ఖాయమని.. ఆయన ఎవరి వైపు నిలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనాలు వెల్లడయ్యాయి. ఈ రెండు సర్వేల్లోనూ… బీజేపీ, కాంగ్రెస్ కు దాదాపుగా సమానంగా సీట్లు వస్తాయని స్పష్టమయింది.
కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. వచ్చే నెల పన్నెండో తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఇరవై రోజుల్లో ఏం జరగబోతోందనేది… కూడా ఎన్నికల ఫలితాలకు కీలకం కానుంది. అప్పటి వరకు…హంగ్ ఖాయం అనే భావించాలేమో..?