ఊరకనే పొగుడుతారా .. ఏదో ఓ ప్రయోజనం ఉండకపోతే అని ఓ పాట రాసి ట్యూన్ చేసుకోవాలేమో..?. మోదీ అంబేద్కర్ అంతటి వాడన్నట్లుగా ఆరున్నొక్క రాగంతో పాడేసిన ఇళయరాజా గానం వెనుక లోగుట్టు తాజాగా బయటకు వచ్చింది. ఆయనను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను.. 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది. ఆ స్పెషల్ కోటా కిందే.. తాజాగా ఇళయరాజా పేరును రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సంగీత రంగంలో ఇళయరాజా మ్యాస్ట్రోగా పేరు పొందారు. ఆ రంగంలో రాజ్యసభ ఇవ్వాలంటే ఇళయరాజా అర్హతలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇళయరాజా కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరేళ్ల కిందట సుబ్రమణ్యస్వామిని బీజేపీ రాజ్యసభకు పంపింది. ఆయన పదవీకాలం జూన్లో ముగుస్తుంది. ఆయనకు మళ్లీ కొనసాగింపు ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేదు. ఆయన స్థానంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నట్లుగా తెలుస్తోది.
అయితే ఇళయారాజాను నేరుగా బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను తటస్థునిగా ఉంచుతూనే పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. దీని వల్ల బీజేపీకి ఆయన ఫ్యాన్స్ నుంచి ఆదరణ లభించవచ్చు. బీజేపీలో చేరకుండానే ఇలా రాష్ట్రపతి నామినేట్ చేయడం ద్వారా పలువురు ప్రముఖులు రాజ్యసభ సభ్యులు అయ్యారు. అలాంటివారిలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, సచిన్ టెండూల్కర్ వంటి వారు రాజ్యసభ సభ్యులు అయ్యారు.