తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని టి. తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది! పోటీకి దూరంగా ఉంటూ… కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. ఓ మూడు లోక్ సభ స్థానాలకు టీడీపీ పోటీపడే అవకాశం ఉందనే చర్చ నిన్నటివరకూ జరిగింది. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లేదా మరో స్థానంలో అభ్యర్థులను పెడితే బాగుంటుందనే అభిప్రాయంతో టీడీపీ ఉండేది. సికింద్రాబాద్ భాజపాకి సిట్టింగ్ నియోజకవర్గమే అయినా… టీడీపీ పొత్తు వల్లనే అక్కడ కమలం పార్టీ గెలుస్తోందనేది వారి అంచనా. ఏదైతేనేం… పార్టీ ఆవిర్భావం తరువాత ఇలా ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకోవడం కీలక పరిణామమే. ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకోవడంపై తెలంగాణకు చెందిన టి. కార్యకర్తలు కూడా జీర్ణించుకునే పరిస్థితి లేదనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది.
పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి నేతలతో నిన్ననే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీ పోటికి దిగితే, కాంగ్రెస్ అభ్యర్థులకు కొంత నష్టం వాటిల్లుతుందనీ, తెరాస లాభపడుతుందని ఉత్తమ్ నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో మన లక్ష్యం నెరవేరకుండా మిగిలిపోతుందనీ, టీడీపీ మద్దతు తమకు కచ్చితంగా అవసరమని కోరారని సమాచారం. ఈ చర్చలు ఫలించడంతో.. కాంగ్రెస్ మాత్రమే బరిలో ఉంటుంది, టీడీపీ మద్దతు ఇస్తుందనేది స్పష్టమైంది. నిజానికి, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏం చెయ్యాలనే అంశంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో గతవారమే టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర నేతలే దానిపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. కొంతమంది ఆశావహులు టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్ల కోసం ప్రయత్నించిన పరిస్థితీ ఉంది. కానీ, చివరికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయించారు.
కారణాలు ఏవైనా కావొచ్చు… ఎన్నికల బరిలో పోటీకి లేకపోవడం ఏ రాజకీయ పార్టీకైనా ఏరకంగానూ సానుకూల నిర్ణయం కాదు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ నిలబెట్టుకోవడం సవాల్ గానే మారింది. గడచిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయింది. దీంతో, మరో ఐదేళ్ల విజన్ తో పార్టీని ముందుకు నడపాల్సిన అవసరం ఉంది. కానీ, టీడీపీలో ఇప్పుడు పేరున్న నాయకులే లేని పరిస్థితి. పోనీ, ఉన్నవారైనా పోటీకి దిగి ఉనికిని నిలబెట్టుకుంటారా అంటే… తెరాస, భాజపాలకు అవకాశం ఇవ్వకూడదన్న కారణంతో పోటీకి దూరమయ్యారు. ఇది టీడీపీ కార్యకర్తలపై, కేడర్ పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పార్టీకి నాయకులు కరవైన ఈ సమయంలో… ద్వితీయ శ్రేణి నుంచి కొత్త నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీలో తమ భవిష్యత్తుపై ఎవరికైనా ఏం నమ్మకం ఉంటుంది..? తాజా నిర్ణయం తాత్కాలిక అవసరమే కావొచ్చు, కానీ దీర్ఘకాలంలో పార్టీ మనుగడకు ఇది సానుకూల సంకేతమైతే కాదు.