కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తారని అంటుంటారు. అందులో నిజమెంత ఉందో కాని, వారిద్దరి సాన్నిహిత్యం దృష్ట్యా ఆ వాదనలకు విశ్వసనీయత ఏర్పడింది. అయితే వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అధికారానికి దూరమయ్యాక , కేసీఆర్ ను జగన్ ఏమాత్రం ఫాలో కావడం లేదన్నది సుస్పష్టం. గతం ఎలా ఉన్న ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా జగన్ కొంతకాలం కేసీఆర్ ను ఫాలో అవ్వడమే మంచిది అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
రాజకీయాల్లో జగన్ కన్నా కేసీఆర్ అనుభవజ్ఞుడు. ఎప్పుడు ఏం చేయాలి..? ఏం మాట్లాడాలి అనేది జగన్ కన్నా కేసీఆర్ కు బాగా తెలుసు. అయినా కొన్నాళ్లుగా సైలెన్స్ మెయింటేన్ చేస్తున్న కేసీఆర్.. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అవకాశం వచ్చినా అందుకు ఆసక్తి చూపడంలేదు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వరద సహాయక చర్యలపై సర్కార్ వైఖరిపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేసీఆర్ కు ఇదొక అస్త్రమే అయినా.. ఆయన మాత్రం రంగంలోకి దిగలేదు.. పార్టీ నేతలే ఈ అంశంపై స్పందించారు తప్పితే కేసీఆర్ వరద రాజకీయానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో ఏపీలో జగన్ మాత్రం అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా వరద రాజకీయం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉంటూ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తూ బాధితులకు ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు.. అయినా జగన్ విమర్శలు చేస్తుండటంపై జనం నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా..నా రాజకీయం నేను చేస్తా అన్నట్టుగా చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కేసీఆర్ ను అనుసరిస్తూ,అనుకరించిన జగన్ ఇప్పుడు కూడా కొంతకాలం కేసీఆర్ లాగే మౌనంలో ఉండటమే ఉత్తమమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.