తెలంగాణ సీఎం జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉండేది బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీనేనని ధర్డ్ ఫ్రంట్.. ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని నితీష్ కుమార్ తేల్చి చెబుతున్నారు. తాను కాంగ్రెస్ కూటమిలో భాగమని ఆయన నేరుగానే ప్రకటించారు. ఎన్డీఏలో అసలు పార్టీలే లేవు కాబట్టి.. బీజేపీ .. కాంగ్రెస్ కూటమి మధ్యే పోరాటం ఉంటుందన్నారు. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కూటమి వైపు చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నితీష్ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇటీవల బీహార్ వెళ్లి మరీ నితీష్ కుమార్తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ గురించి చర్చించినట్లుగా ప్రచారం జరిగింది. ప్రెస్ మీట్ లో కేసీఆర్ కూడా అదే చెప్పారు. దేశానికి ప్రత్యమ్నాయం అవసరం అన్నారు.. కలసి పోరాడతామని చెప్పారు. కానీ చివరికి నితీష్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. బీహార్లో కాంగ్రెస్, జేడీయూతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే హర్యానాలో ఓ వైపు విపక్ష పార్టీల బహిరంగసభ జరుగుతున్న సమయంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలన్నీ బీజేపి అనుకూల.. వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి. బీజేపీ రాజకీయాల కారణంగా కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినా సామంత పార్టీలుగా ఉండిపోతున్నాయి. కూటమిలో ఉన్న పార్టీలు మాత్రం గుడ్ బై చెబుతున్నాయి. కాంగ్రెస్ తో ఉన్న పార్టీలు మాత్రం ఆ పార్టీతోనే ఉన్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో కూటమిలో ఉన్నాయి. నితీష్ , మమతా బెనర్జీ కూటమిలో భాగం అయితే..ఎస్పీ లాంటి ఇతర పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.