సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. 151 నుంచి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావడంతో తిరిగి రాజకీయాల్లో వైసీపీ నిలదొక్కుంటుందా..? అనే ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఓ వైపు ఏపీలో కాంగ్రెస్ పునర్ వైభవానికి ప్రయత్నిస్తుండటంతో వైసీపీకి భవిష్యత్ భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ బలపడాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సెలవిచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్.
ఏపీలో తమిళనాడు తరహ రాజకీయాలు మొదలు అయ్యాయన్న ఉండవల్లి, కరుణానిధికి ఏడు స్థానాలు, జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేసారు. అయినప్పటికీ అక్కడ వారు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషిస్తే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కానీ, ప్రతిపక్ష పాత్రలో వైసీపీ రాజకీయాలకు ప్రజల ఆదరణ ఉంటుందా..? అన్నది పెద్ద ప్రశ్న. ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు నరకంలా ఫీల్ అవ్వడంతోనే కూటమికి ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయనేది ఓపెన్ సీక్రెట్.
అయినా, ఉండవల్లి సూచించినట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాడుతారా అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి. 11మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది చంద్రబాబు పాలనకు మెచ్చి ప్రభుత్వానికి జైకొట్టే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో అసెంబ్లీని కాదని ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరుబాట పట్టినా వైసీపీకి ప్రజల నుంచి మద్దతు లభించడం అంతా ఈజీ కాదు. ప్రతిపక్ష హోదాను కూడా దక్కనివ్వకుండా వైసీపీని చిత్తుగా ఓడించారంటే వైసీపీపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో స్పష్టమైంది.
దీంతో ఉండవల్లి చెప్పినట్లుగా తమిళనాడు తరహ రాజకీయాలు ఏపీలో ప్రారంభమయినా వచ్చే ఐదేళ్ల నాటికి వైసీపీ మాత్రం బలపడే అవకాశాలు తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.