టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన చేస్తారని వారంటున్నారు. ఆ తర్వాత విశాఖలో జగన్ పర్యటనలో పార్టీలో చేరుతారంటున్నారు. అయితే ఈ అంశంపై వైసీపీ వర్గాలు మాత్రం గుంభనంగా ఉన్నాయి. విశాఖ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలెవరూ గంటా చేరికను స్వాగతించడం లేదు. అందుకే సైలెంట్‌గా ఉన్నారు.
టీడీపీ ఓడిపోయినా.. ఎమ్మెల్యేగా గెలిచిన గంటా.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన చాలా సార్లు బీజేపీలో చేరుతారని.. కొన్ని సార్లు వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఎప్పుడూ నిజం కాలేదు. మరో వైపు టీడీపీ నేతలు వైసీపీ దాడులకు.. కేసులకు ఎదురొడ్డి పోరాడారని.. కానీ గంటా మాత్రం చల్లగా ఇంట్లో కూర్చున్నారని ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. అసలు ఆయన పార్టీలో లేరని చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓ వైపు కేసులకు ఎదురొడ్డి నిలిచిన అయ్యన్న కుటుంబాన్ని అవమానించినట్లేననన్న భావన టీడీపీలో ఉంది. దీంతో గంటా కు టిక్కెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచనలో ఉన్నారని అంటున్నారు.
చంద్రబాబు ఇప్పటికే టిక్కెట్లను దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. ముఖ్యంగా సిట్టింగ్‌లకు కన్ఫర్మ్ చేశారు. కానీ గంటాకు మాత్రం చేయలేదు. ఆయన నియోజకవర్గ సమీక్ష చేయలేదు. ఆయనకు పిలుపునివ్వలేదు. గతంలో సమీక్షలకు పిలిస్తే రాలేదు. వైసీపీ పాలనపై పోరాడిన వాళ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని గంటా లాంటి నేతలకు చాన్స్ ఇస్తే క్యాడర్ స్థైర్యం దెబ్బతింటుందన్న అభిప్రాయం పార్టీలో ఉంది.
అదే సమయంలో ఆయన టీడీపీలో ఉండటం వల్ల గ్రూపు గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు దూరం పెట్టడంతో వైసీపీలో చేరుతున్నారన్న లీకులు ఇస్తున్నారని అంటున్నారు. నిజంగానే వెళ్లిపోతే.. టీడీపీకి ఓ సమస్య పరిష్కారమైనట్లేనని టీడీపీ క్యాడర్ భావిస్తున్నారు.