ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ఏదనుకుంటే అది చేశారు. ఎవరికి పదవి ఇవ్వాలనుకుంటే వారికి ఇచ్చారు. ఎవర్ని తీసేయాలనుకుంటే వార్ని తీసేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ విషయంలో కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయం మంత్రివర్గ ప్రక్షాళన అంశంలోనే తేలిపోతోంది. వందకు వంద శాతం మంత్రుల్ని తొలగించి.. కొత్త వారికి చాన్సివ్వాలని గతంలో నిర్ణయించారు. కసరత్తు కూడా పూర్తి చేశారు. కానీ వివిధ కారణాలతో ఆగిపోయారు. కానీ ఇప్పుడు కొంతమంది మంత్రుల్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.
సామాజికవర్గాలు.. ఇతర కారణాలతో కొంత మందిని కొనసాగించవచ్చని.. మంత్రి పదవులు పోయినవారు ఫీలవ్వొద్దని జగన్ చెప్పారు. అందర్నీ తొలగించి కొత్త వారిని తీసుకుంటే.. ఎవరూ ఫీల్ అయ్యే చాన్స్ ఉండేది కాదు. అందర్నీ తీసేశారు కదా అనుకునేవారు. కానీ ఇప్పుడు కొంత మందినే తీసేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో వారు ఫీలయ్యే అవకాశాల ఉన్నాయి. ఆ కొంత మందిని జగన్ ఎందుకు కొనసాగిస్తున్నారనేది వైసీపీలో చర్చనీయాయంశం అవుతోంది. సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు ఇస్తారని చెప్పినప్పటికీ.. వారు అలా అయితే తిరుగుబాటు తరహాలో పని చేసే అవకాశం ఉందని నివేదికలు అందినట్లుగా తెలుస్తోంది.
మంత్రులుగా ఉండి.. అధికారం ఉంటేనే… జిల్లాల్లో సీట్లు గెలిపించడానికి ప్రయత్నిస్తాం కానీ.. మంత్రి పదవి తీసేసి గెలుపు బాధ్యతలు ఇచ్చి.. తమ ప్లేస్లో అధికారం అనుభవించేవారు వేరే వారు ఉంటే.. తాము ఎలా పని చేయగలమని కొంత మంది సీనియర్లు అంతర్గత చర్చల్లో పెద్దలను నిలదీసినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా పెద్దిరెడ్డి లాంటి వారిని కేబినెట్ నుంచి తీసేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంచిది కాదని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వెనుకడుగు వేశారని అంటున్నారు.
నిజంగా నేతల అసంతృప్తి కారణంగానే జగన్ మంత్రివర్గంలో కొంతమందిని కొనసాగించాలనుకుంటే.. అది ఖచ్చితంగా ఆయనలో వచ్చిన మార్పేనని వైసీపీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. తిరుగులేనంత అధికారం చెలాయిస్తూ.. పార్టీలో ఇతరులు ఏమైనా చేస్తారేమోనని భయపడే పరిస్థితి రావడం… విచిత్రమేనని అంటున్నారు. ఇది జారిపోయిన పట్టుకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎంత వరకూ.. ఎలా ఉందనేది.. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత తెలిసే అవకాశం ఉంది.