బయటకు ఒక్క సమాచారం తెలియనివ్వడం లేదు కానీ.. వైసీపీ అడుగులు చూస్తూంటే పక్కాగా ముందస్తు సన్నాహాలేనని అర్థం చేసుకోవడానికి పెద్దగా పొలిటికల్ ఢక్కామొక్కీలు తిని ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జుల్ని గడప గడపకూ పంపుతున్నారు. పార్టీ చేసిన మేలు.. ప్రభుత్వం చేసిన మేలు గురించి ఓట్లు వేయమని అడుగుతున్నారు. నిజానికి రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే ఓట్లు అడగడం అంటే ఎవరూ నమ్మరు. ఖచ్చితంగా హఠాత్తుగా అసెంబ్లీని రద్దు చేస్తారు కాబట్టే ఇలా ప్రచారం చేస్తున్నారన్న బలమైన నమ్మకం ఇప్పటికే ఉంది.
ఇక ముందస్తు సన్నాహాల్లో భాగంగా అభ్యర్థులపై కూడా వైసీపీ అగ్రనేతలు కసరత్తు పూర్తి చేశారన్న చర్చ జరుగుతోంది. అందుకే సగం మంది ఎమ్మెల్యేలకు ఈసారి చాన్స్ ఉండదన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ సారి బీసీ మంత్రం కాబట్టి సగం మందికి బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇటీవల ఇంచార్జ్లను మారుస్తున్నారు. మరికొందరిని మారుస్తున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అంతర్గతంగా ఒక్క సారిగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారని కూడా చెబుతున్నారు.
ఇక స్ట్రాటజిస్ట్తో అందరి సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో పీకే జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ విషయాన్ని జగనే చెప్పారు. ఈ సారి పీకే అందుబాటులో లే్రు. అందుకే ఆయన సూచించిన రుషిరాజ్ తో పని చేయించుకుంటున్నారు. ఆయన కూడా పీకే స్టైల్ లో వర్క్ చేస్తారని.. వైసీపీ ఆశిస్తోంది. ఎన్నికల నిధులు.. ఇతర వనరుల సమీకరణను జగన్ పూర్తి చేశారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చన్న మానసిక స్థితికి చేరిపోయారు. కొంత మంది చురుగ్గా మళ్లీ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటే.. మరికొందరు మాత్రం… ఇంకా నిర్లిప్తంగానే ఉన్నారు.