వంశీ పోలీస్ కస్టడీలో నాకేం తెలియదని ..గుర్తు లేదని చెబుతున్నారు. అయితే పోలీసులు ఆధారాలు సేకరించని వాటికి అలా చెబితే కాస్త నమ్మశక్యంగా ఉంటుంది కానీ ఎదురుగా వీడియో ఆధారాలు పెట్టి అడిగినా అదే సమాధానం చెపితే వింతగా చూస్తారు. వంశీ పోలీసు కస్టడీలో చెబుతున్న సమధానాలు అలాగే ఉన్నాయి. సత్యవర్ధన్ హైదరాబాద్ వచ్చి తన ఇంట్లో ఓ రోజు ఉండిపోయారు. ఎందుకు ఉన్నాడో.. ఎందుకు వచ్చాడో..ఇంకా చెప్పాలంటే ఆ వచ్చింది సత్యవర్ధన్ అని కూడా తెలియదట. మైహోంభూజాలోకి ఎవరైనా వెళ్లాలంటే.. ఏ ఫ్లాట్ కు వెళ్తారో కనుక్కుని ఆ ఫ్లాట్ లో ఉండే వాళ్లకు ఫోన్లు చేసి.. వారు అంగీకరిస్తేనే పంపుతారు.లేకపోతే పంపరు. అయినా అదేదో తన ఇళ్లు ధర్మ సత్రం అయినట్లుగా వచ్చి పోయాడని చెబితే ఎలా నమ్ముతారు?
పోలీసులు పూర్తి స్థాయి ఆధారాలతో కిడ్నాప్ డ్రామా నడిపినప్పుడు ఓ రోజంతా తాడేపల్లిలోనే ఉండి జగన్ ను కలిసినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతా జగన్ కనుసన్నల్లోనే ఈ డ్రామా నడిచిందని అనుమానిస్తున్నారు. తాడేపల్లిలో జగన్ ను కలిసినట్లుగా మొదట అంగీకరించని వంశీ.. ఆధారాలు చూపించడంతో తర్వాత అంగీకరించారు. అయితే ఆయనతో కిడ్నాప్ స్కెచ్ గురించి మాట్లాడలేదని చెబుతున్నారు.
సత్యవర్ధన్ విషయంలో వంశీ చేసిన వ్యవహారం మొత్తం పూర్తిగా బయటపడింది. సాంకేతిక ఆధారాలు అన్నీ ఉన్నాయి. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకు వచ్చారు. హైదరాబాద్ నుంచి విశాఖ పంపించారు. విశాఖ నుంచి పోలీసులు పట్టుకెళ్లారు. ప్రతీ చోటా వంశీ అనుచరులు, రౌడీషీటర్లు సత్యవర్ధన్ కు కాపలా ఉన్నారు. ఆ దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియానే బయట పెడుతోంది. ఇతర కేసులతో పోలిస్తే ఫిర్యాదుదారును బెదిరించడం, కిడ్నాప్ చేయడం తీవ్రమైన విషయం. అందుకే కస్టడీలో ఏం చెప్పాలో తెలియక అడ్డంగా దొరికిపోతున్నారని అంటున్నారు.
వైసీపీ ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డినే ..వంశీ కోసం వాదిస్తున్నారు. ఆయన తన అసిస్టెంట్లను పంపి ఏం చెప్పాలో కూడా ఫీడింగ్ ఇస్తున్నారని అంటున్నారు. ఆయన తన వాదనలతో వంశీని మరింత ఇరికించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తప్పు చేశాడు.. తప్పేంటి అన్నట్లుగా దబాయిస్తూండటంతో ఆయనను నమ్ముకున్న వైసీపీ నేతలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కస్టడీ తర్వాత వంశీ మరిన్ని సమస్యల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.