వైయస్ వివేకానంద రెడ్డి హత్య కొద్ది వారాల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో బలమైన అంశం అవుతుందనుకున్న ఆ కేసు ఎన్నికల సమయానికి ప్రభావం కోల్పోయినట్లు కనిపిస్తుంది. దీంతో ఈ కేసు వల్ల వైఎస్సార్ సీపీకి జరగాల్సిన డ్యామేజ్ నుండి జగన్ తెలివిగా తప్పించుకున్నట్లే అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నిజానికి వై.ఎస్.వివేకానందరెడ్డి చనిపోయిన ఉదయం సాక్షి ఛానల్ సహా అన్ని చానల్స్ కూడా అది సహజ మరణం అంటూ వార్తలు ఇచ్చాయి. జగన్ సహా వైఎస్ఆర్ సీపీ నేతలు అందరూ కూడా వివేకానంద రెడ్డి మరణం గురించి ఇది దురదృష్టకరమైన సంగతి అంటూ మాట్లాడారు తప్పించి హత్య అన్న ఆరోపణలు ఎవరూ చేయలేదు. అయితే పోలీసులు వచ్చి పోస్ట్మార్టం జరిపే పరిస్థితి ఏర్పడ్డాక వైఎస్ఆర్ సీపీ నేతలు సడన్ గా యూ టర్న్ తీసుకున్నారు. ఇది హత్యేనని, చేయించింది తెలుగుదేశం పెద్ద లేనని వారు అన్నారు. విజయసాయి రెడ్డి లాంటి నేతలు- చంద్రబాబు నాయుడు, లోకేష్ ,మంత్రి ఆదినారాయణరెడ్డి దగ్గరుండి ఈ హత్య చేయించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా సాయంత్రానికల్లా తన బాబాయిని గొడ్డలితో నరికి చంపారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో ప్రజల్లో ఒక రకమైన గందరగోళం ఏర్పడింది. ఎన్నికలకు పది రోజుల ముందు కేసులోని నిజాలు బయటికి వస్తాయి అని, ఇది ఇంటి దొంగల పనేనని, కాబట్టి నిజాలు బయటికి వస్తే, తెలుగుదేశం పార్టీ నేతలు హత్య చేయించారనే ఆరోపణలు బూమరాంగ్ అయి వైఎస్ఆర్ సీపీకి డ్యామేజ్ తప్పదని కొందరు భావించారు. అయితే అనూహ్యంగా, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం ఈ కేసు వివరాలు ఎన్నికల ముందు ప్రజల ముందుకు రాకుండా ఆర్డర్లు తెచ్చుకోవడంలో సఫలీకృతులు కావడంతో, ఈ కేసు లోని నిజాలు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరుగుతుంది అని కొందరు వేసుకున్న అంచనాలు అన్ని తలకిందులు అయిపోయాయి. అయితే ఇప్పటికే కెసిఆర్, మోడీ లు ఇద్దరూ జగన్కు సహకరించడం వల్ల, అనేక అంశాల్లో జగన్ కి ఈ విధంగా కలిసి వస్తోంది అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ రకంగా చూస్తే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సమయంలో జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్స్, ఎన్నికలలో పార్టీ అవకాశాలను దెబ్బతీయకుండా చేసుకోవడం లో జగన్ చాకచక్యంగా వ్యవహరించాడని, పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ నుండి ఏదో రకంగా బయటపడ్డాడని వైఎస్ఆర్సిపి అభిమానులు భావిస్తున్నారు.
మరి కొద్ది గంటలలో ఎన్నికలు జరగనుండగా, మరి వైయస్ వివేకా హత్య కేసు తదనంతర పరిణామాలు ఎన్నికలలో ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అన్నది మే 23న ఫలితాలు వచ్చాక తెలుస్తుంది.