పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన తల్లి విజయమ్మను కూడా దూరం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా..? వైసీపీ ఓటమికి తన చెల్లి షర్మిల ఎంత కారణమో, తల్లి విజయమ్మ కూడా అంతే కారణమని పార్టీ నేతల అభిప్రాయంతో జగన్ ఏకీభవించారా..? ఎప్పటికైనా విజయమ్మ చెల్లి పక్షానే ఉంటుందని, తనకు రాజకీయంగా అండగా నిలబడదని జగన్ భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నా..అందులో వైఎస్ కుటుంబ వివాదాలు కూడా తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా గంపెడు ఆశలు పెట్టుకున్న సీమలో ఫ్యాన్ పార్టీ కకావికలం కావడానికి షర్మిల కూడా ఓ కారణం. అదే సమయంలో పోలింగ్ కు ముందు కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని విజయమ్మ పిలుపునివ్వడం తీవ్ర ప్రభావం చూపిందని వైసీపీ అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇదే పులివెందులలో జగన్ మెజార్టీ కోతకు గురయ్యేలా చేసిందన్న టాక్ ఉంది. ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా వ్యక్తపరుస్తున్నారు.
అవును..వైసీపీ ఓటమికి షర్మిలతో పాటు విజయమ్మ కూడా కారణమని మాజీ మంత్రి పేర్ని నాని ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇప్పటికే జగన్ – విజయమ్మ మధ్య దూరం పెరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన చేసిన ఈ కామెంట్స్ తల్లి – కొడుకు మధ్య దూరం పెంచేవే. అయినప్పటికీ జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉండే పేర్ని నాని ఈ కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఇటీవల ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఇవే కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుండగానే ఇప్పుడు పేర్ని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జగన్ తో షర్మిల విబేధించడంతో ఆమెపై వైసీపీ నేతల విమర్శలు రాజకీయంగానే చూశారు. కానీ, విజయమ్మ కూడా వైసీపీ ఓటమికి కారణమని ఆరోపించడం వెనక కారణం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
జగన్ పూర్తిగా తన ఫ్యామిలీతో దూరం కావాలని భావిస్తున్నారని.. అందుకే ఆయన సన్నిహిత నేతలు విజయమ్మపై కూడా విమర్శలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.