ఎన్నికల వరకు స్పీచ్ మొదలుపెడితే కుల, మత భేదం లేకుండా పనిచేశానని… పదవులిచ్చానని, బీసీల నినాదంతో ముందుకు సాగిన జగన్ యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వరుసగా నేతలతో భేటీ అవుతున్న జగన్, తాజాగా పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమే… దేశంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, రాబోయే రోజుల్లో వైసీపీ ఏం చేయాలన్న అంశంపై చర్చించారు.
అయితే, లోక్ సభ-రాజ్యసభలో పార్టీ లీడర్లుగా తన సామాజికవర్గానికే జగన్ పెద్దపీట వేసుకున్నారు. బీసీల నేతగా ఉన్న ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ వంటి వారిని కాదని… విజయసాయిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీ చేసి దారుణ పరాభవం పొందిన సాయిరెడ్డి వైపే జగన్ మొగ్గుచూపారు. ఇక లోక్ సభలో పార్టీ లీడర్ పెద్దిరెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్రకటించారు. మొత్తం పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ.సుబ్బారెడ్డిని ప్రకటించారు. అంటే మూడు కీలకమైన పోస్టులకు ఒకే వర్గానికే కట్టబెట్టారు.
త్వరలో జగన్ కేసులపై విచారణ స్పీడ్ అందుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో…తనకు కావాల్సిన వారికే పదవులు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.