అధికారం కోల్పోయాక జగన్ కు వరుసగా ఊహించని షాకులు తగులుతున్నాయి. జగన్ సన్నిహిత నేతలూ జెండా ఎత్తేస్తున్నారు. ఇంతటి దారుణ పరాభవం తర్వాత వైసీపీకి భవిష్యత్ ఉంటుందనుకోవడం లేదని బయటకు చెప్పలేక వ్యక్తిగత కారణాలు అంటూ నేతలు సైడ్ అవుతున్నారు.
మొదట మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కీలక నేతలతో మొదలైన ఈ వలసల పర్వం తాజాగా కొనసాగుతోన్న రాజ్యసభ , ఎమ్మెల్సీల రాజీనామాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారం చేతులు మారాక విపక్షం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం సహజమే కానీ, ఇంత తక్కువ కాల వ్యవధిలో వైసీపీ పతనం వైపు సాగుతుండటంతో ఆ పార్టీ ఉనికిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది నేతలు కూడా వైసీపీని వీడే అవకాశం ఉంది. పార్టీ మారాలనుకుంటున్నా నేతలను జగన్ కనీసం కన్విన్స్ చేసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జగన్ కు సైతం ఫ్యూచర్ కళ్లముందు కదలాడుతోందని..అందుకే పార్టీని వీడుతోన్న నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నించడం లేదని అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
ఇప్పటికే జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోన్నా ఆ పార్టీ నేతలు ఎవరూ ఖండించడం లేదు. ఇలా చేస్తే అయినా బీజేపీ అధిష్టానం దగ్గర ప్రాధాన్యత లభిస్తుందని అనుకున్నా.. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉండగా అది సాధ్యం కాదని జగన్ కు క్లారిటీ వచ్చేసింది.
అందుకే ఇక ఇండియా కూటమి వైపు టర్న్ అవుతున్నారని.. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలహీనపడితే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దపడే ..పార్టీ వీడాలనుకుంటున్న సీనియర్ నేతలను జగన్ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.