ప్రత్యేక హోదా ఉద్యమానికి పునరుజ్జీవం ఇస్తున్నట్టుగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను పాదయాత్రకు వెళ్లిపోయినా పార్టీ ఎమ్మెల్యేలూ ఇతర నేతలు ఉద్యమాన్ని కొనసాగిస్తారన్నారు. అంతేకాదు, ప్రత్యేక హోదా సాధనలో చివరి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తారని కూడా చెప్పిన సంగతి విదితమే. అయితే, ఇప్పుడు ఇదే విషయమై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్ఫూర్తితోనే ఈ రాజీనామాల అంశాన్ని జగన్ మరోసారి తెరమీదికి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా ఎంపీలతో రాజీనామాలు చేయించడమే జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అదే ఊపుతో ఎన్నికలకు వెళ్తే ప్రభావవంతంగా ఉంటుందనేది వైకాపా ఆలోచన అంటున్నారు. తెలంగాణ సాధన ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు నాడు కేసీఆర్ కూడా ఇదే ఫార్ములాను అనుసరించారనీ, దాన్నే ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఫాలో అవుతున్నారంటూ కొంతమంది విశ్లేషించేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ రాజీనామాలతోనే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితిని కేసీఆర్ సృష్టించేవారు. సెంటిమెంట్ ను తెలంగాణ ప్రజల్లో సజీవంగా ఉంచడం కోసం ఈ పద్ధతిని అనుసరించి ఆయన సక్సెస్ అయ్యారు. అయితే, ఇదే ఫార్ములా జగన్ అనుసరించడం వరకూ ఓకే. కానీ ఆంధ్రాలో అది వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక బలీయమైన ప్రజాభిప్రాయానికి కేసీఆర్ ఆసరా అయ్యారు. ఉద్యమాన్ని కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. ఆ ఊపును ఎక్కడా తగ్గనీయకుండా ముందుండి నడిపారు. దాన్లో భాగంగా రాజీనామాలు చేసేవారు. అంతేగానీ, రాజీనామాలతోనే ఉద్యమానికి ఓనమానాలు దిద్దలేదు.
ప్రత్యేక హోదాకు సంబంధించి అలాంటి సెంటిమెంట్ ఏదీ ఏపీ ప్రజల్లో ఇప్పుడు లేదు. విశాఖ సాగరతీరంలో యువత నిరసన చేపట్టిన నాటి నుంచైనా జగన్ అదే వేడిని కొనసాగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఆ తరువాత, జగన్ కూడా అడపాదడపా మాత్రమే హోదా గురించి మాట్లాడారు. దానికంటూ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ అనుసరించలేదు. ఇక, ఇప్పటి పరిస్థితికి వస్తే.. హోదా వచ్చి తీరాలనీ, లేదా రాకపోవడం వల్ల చాలా అన్యాయానికి గురైపోయామన్న భావనే ఆంధ్రా ప్రజల్లో లేదు! ప్యాకేజీతో ఆ లోటు సర్దుబాటు అయిపోయిందనే ప్రచారం అధికార పార్టీ బాగానే చేసింది. కాబట్టి, ఎంపీల రాజీనామా వల్ల కొత్తగా వచ్చే ఊపు అంటూ ఏదీ ఉండదనే అనిపిస్తోంది.
ఒకవేళ, మొదట్నుంచీ ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని తీవ్రంగా నడిపి, ఎన్నో పోరాటాలు చేసి, ప్రభుత్వం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న అనుభవాలు వైకాపాకి ఉంటే… ఆ క్రమంలో రాజీనామాలు చేస్తే కొంత ప్రభావం ఉండే అవకాశాలుండేది. రాజీనామాలు చివరి అస్త్రం అని వైకాపాని అనిపించినా… దానికి ముందుగా వైకాపా చేసిన ఉద్యమం తీవ్రత, ప్రయత్నాల చిత్తశుద్ధిపై ఆ చివరి అస్త్రం ప్రభావం ఉంటుంది కదా! అంతేగానీ, గతంలో కేసీఆర్ చేసినట్టుగానే జగన్ కూడా రాజీనామాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేంత పరిస్థితులేవీ కనిపించడం లేదు. కాకపోతే… ఎన్నికల ముందు కొంత హడావుడి సృష్టించడానికి, వైకాపాకి హోదా పట్ల ఇంత చిత్తశుద్ధి ఉందీ అని ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఆ పర్వం కొంత పనికొస్తుంది. అంటే, చివరి అస్త్రం కేవలం ప్రచారాస్త్రంగానే ఉపయోగపడే అవకాశాలుంటాయి. ఈ విషయంలో కేసీఆర్ ఫార్ములా స్ఫూర్తిగా తీసుకోవచ్చునేమోగానీ, అదే స్థాయి ఫలితాలు వైకాపా సాధించే అవకాశాలు తక్కువే.