రాజ్యసభ సీటు ఇస్తారని ఏకంగా ఎంపీ అయిపోయి ఢిల్లీకి ఎగిరిపోవచ్చని గాల్లో తేలిపోతున్న సినీ నటుడు అలీకి గిలిగింతలే పెడుతున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. రాజ్యసభ సీటు అంటే సామాన్యమైన విషయం కాదు. వైసీపీ అధినేతపై చాలా ఒత్తిడి ఉంటుంది. మైనార్టీలకు ఇవ్వాలనుకున్నా పార్టీ కోసం అలీ కన్నా ఎక్కువగా కష్టపడిన వారు చాలా మంది ఉన్నారు. జగన్తో సంబంధాలు ఉన్న ప్రముఖులూ ఉన్నారు. సాధారణంగా రాజ్యసభ సీట్ల కోసం పార్టీలోనే పోటీ ఉంటుంది. కానీ వైసీపీ విషయంలో భిన్నం. దేశ వ్యాప్తంగా పోటీ ఉంటుంది. పలువురు పారిశ్రామికవేత్తలు తమకు రాజ్యసభ సీటివ్వాలని జగన్పై ఒత్తిడి తెస్తూ ఉంటారు.
గతంలో రిలయన్స్ కోటా కింద ఓ రాజ్యసభ సీటిచ్చారు. ఈ సారి అదానీ కోటా కింద ఓ రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కాకుండా మిగిలేది మూడు మాత్రమే. ముందస్తు కమిట్మెంట్ల ప్రకారం చాలా మంది లైన్లో ఉన్నారు. అలీకి రాజ్యసభ అనే అంశమే చర్చకు రాలేదని కేవలం నామినేటెడ్ పోస్టు గురించి మాత్రమే చర్చ జరుగుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అలీ అసెంబ్లీ టిక్కెట్ అడుగుతారనే ఉద్దేశంతో ఇప్పటి నుండే రేసు నుంచి తప్పించాలంటే ఏదో ఓ పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో హైకమాండ్ ఉందని చెబుతున్నారు.
అలీకి ఇవ్వబోయేది వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అని ఇప్పటికే వైసీపీలో గట్టి ప్రచారం ఉంది. దీనిపై ఎప్పుడైనా అధికారిక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. అదే జరిగితే అలీకి అశనీపాతమే అవుతుందంటున్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఆయనను పెట్టి ఇతరులు కార్యకలాపాలు నిర్వహిస్తారు. కానీ ఆ అవకతవకలన్నీ అలీ ఖాతాలో పడతాయి. అప్పుడు అలీ పడాల్సిన కష్టాలన్నీ పడతారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. దీనికి అలీ ఒప్పుకుంటారో లేదో చూడాలి.