వైసీపీ అధినేత జగన్ రెడ్డి సడెన్ గా బెంగళూరుకు ఎందుకు వెళ్ళారు..?అత్యవసరంగా బెంగళూరు వెళ్ళడానికి దారితీసిన పరిణామాలేంటి..? ఈ పర్యటన వ్యక్తిగతమా? రాజకీయమా?
ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. జగన్ అత్యవసరంగా బెంగళూరుకు వెళ్ళడానికి పులివెందుల కౌన్సిలర్ల కాంట్రాక్ట్ బిల్లుల బెడదేనని చర్చ జరుగుతుండగా.. కాంగ్రెస్ లో వైసీపీ విలీనంపై చర్చించేందుకే పులివెందుల నుంచి మకాం మార్చారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురుఅవుతాయని అంచనా వేసే కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని… అందులో భాగంగానే జగన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో చర్చించేందుకు బెంగళూరు వెళ్లారన్నారు. నల్లమిల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆరోపణలుగానే కనబడుతోన్నా…రాజకీయాల్లో ఇలాంటి వాటిని అసలు కొట్టిపారేయలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు.
వైసీపీని ఓ పిల్ల కాలువ అని..ఆ పిల్ల కాలువలన్నీ కాంగ్రెస్ లో కలవాల్సిందేనని ఇటీవల షర్మిల వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే జగన్ బెంగళూరుకు వెళ్ళడం… ఈ నేపథ్యంలో నల్లమిల్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.