“ప్రైవేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం”.. అన్నది రాజకీయ నాయకులను ఉద్దేశించి.. శ్రీశ్రీ ఓ తిరుగుబాటు ఉద్దేశంతో చేసిన రచన. దీనర్థం.. ప్రైవేటు బతుకుల్ని తీసుకొచ్చి పబ్లిక్‌లో పెడతానని కాదుగా. రాజకీయాలల్లో ఉన్నా.. సినిమా తారలైనా… అది ప్రజాసంబంధ విషయం కానంత వరకు వారి వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎవరి వ్యక్తిగత జీవితంపైనైనా బహిరంగంగా కామెంట్ చేశారంటే.. వారికి విలువలు లేనట్లే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి విలువలు లేవని తేలిపోయింది. మరో పార్టీ అధినేతను పట్టుకుని.. “కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడని”.. నాటు భాషలో విమర్శించేశారు. జగన్ మాటలు విని మీడియా ప్రతినిధులకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆఫ్ ది రికార్డ్ కూడా.. అలాంటి మాటలు రాజకీయ నేతలు.. మీడియా మందు మాట్లాడరు. కానీ జగన్ మాత్రం ఓపెన్ అయిపోయారు.
అసలు విశేషం ఏమిటంటే.. జనసేన అధినేతకు విలువలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ..జగన్మోహన్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు. పవన్‌కు ఉన్న విలువ సంగేతమో కానీ..ఈ కామెంట్ల ద్వారా తనకు ఏ మాత్రం విలువలు లేవని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నట్లయింది. సాటి రాజకీయ నేతలను, పెద్దలను ఏ మాత్రం గౌరవించని తత్వం జగన్మోహన్ రెడ్డిదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని.. ఇలాంటి ప్రకటనల ద్వారా వెల్లడవుతూ ఉంటుంది. వైసీపీ అధినేతకు ఎవరిపైనైనా ఉక్రోషం వస్తే అస్సలు దాచుకోరు. దాన్ని వ్యక్తిగత విమర్శల వరకూ తీసుకెళ్తారు. ఇప్పుడు పవన్ విషయంలో మరింత ఎక్కువగా మాట్లాడారు.. కానీ చంద్రబాబు విషయంలో ఎప్పుడో చాలా అడ్వాన్స్ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును… “ఏదైనా బావి చూసుకుని దూకు”.. అనడం దగ్గర్నుంచి “ఇంకెంత కాలం బతికి ఉంటారనే” విమర్శల వరకూ.. జగన్ ఎన్నో విమర్శలు చేశారు. నంద్యాల ఎన్నికల సమయంలో.. “నిలబెట్టి కాల్చినా తప్పు లేద”ని వ్యాఖ్యానించారు. ఇలా వివాదాస్పదంగా మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా.. జగన్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పలేదు. అదంతా తన హక్కు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌పైనా అదే తరహా వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌కు విలువలు ఉన్నాయో లేవో కానీ.. జగన్‌కు మాత్రం లేవని తేలిపోయింది.