విశ్లేషణ
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సునిశిత రాజకీయ దృష్టిలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి `ఓ పిల్లకాకి’ ? ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు హావభావాలను నిశితంగా గమనిస్తున్నవారికి అలానే అనిపిస్తుంది మరి. అసెంబ్లీలో చంద్రబాబుని ఎలాగైనా ముప్పతిప్పలు పెట్టాలన్న జగన్ ఎంతగా తపనపడుతున్నా, బాబు హావభావాల ముందు అదంతా వీగిపోతోంది.నిజంగానే జగన్ ని బాబు రాజకీయ పిల్లకాకిగానే భావిస్తున్నారా ? మరింత లోతుగా ఈ విషయంపై విశ్లేషణ కొనసాగిద్దాం…
ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి తగిన సాక్ష్యాధారాలతోనే సభకు వస్తున్నారు. ఇంతగా ఆయన శ్రమపడుతున్నప్పటికీ, బాబు దృష్టిలో జగన్ `ఎదిగీఎదగని నాయకుడి’గానే కనిపిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ఉద్దేశంతో జగన్ అస్త్రశస్త్రాలతో సహా సభకు వచ్చారు. అయితే, జగన్ సభలో వ్యవహరించిన తీరు బాబుకు ఒకానొక సందర్భంలో నవ్వుపుట్టించింది. జగన్ వంక ఎగతాళిగా చూస్తూ, `నీకేం తెలుసు’ అన్నట్లుగా మాట్లాడారు. జగన్ లో రాజకీయ అపరిపక్వత కనిపిస్తున్నదన్న కచ్చితాభిప్రాయం బాబులో ఉంది. జగన్ ఆయన పార్టీ సభ్యులకు శాసన సభలో హుందాగా వ్యవహరించడం చేతకావడంలేదనీ, వారింకా రాజకీయంగా ఎదగాలన్నట్లు బాబు మాట్లాడుతున్నారు. పైగా, తనకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేతగా పదేళ్ల అనుభవం ఉండటాన్ని బాబు పదేపదే గుర్తుచేస్తున్నారు.
చంద్రబాబు విలక్షణ నేత. ఆయనకు ముఖ్యమంత్రిగానూ, ప్రతిపక్షనేతగానూ సమాన అనుభవం ఉంది. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఏవిధంగా సభలో మాట్లాడాలో, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఎలాంటి విసుర్లు విసరాలో బాబుకు బాగాతెలుసు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. సభ జరుగుతున్నప్పుడు ఎంతటి ఉత్కంఠ చోటుచేసుకున్నా చంద్రబాబు తన సీటు వద్దనుంచే మాట్లాడేవారు. ఆవేశకావేశాలు తలెత్తినప్పుడు ఎప్పుడైనా పరుషంగా మాట్లాడినా ఆ తర్వాత సవరించుకునేవారు.
నాడు వైఎస్సార్ తో బాబు ఢీ
కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయభాస్కరరెడ్డి, చెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి వంటివారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు బాబు ప్రతిపక్షంలో ఉన్నారు. మిగతావారి సంగతి ఎలా ఉన్నప్పటికీ, వైఎస్సార్ ముఖ్యమంత్రిగానూ, బాబు ప్రతిపక్షనేతగానూ ఉన్నప్పుడు సభలో కీలక చర్చ జరిగే సమయంలో రెండు కొదమ సింహాలు పోరాడుతున్నట్లే ఉండేది. వాగ్యుద్ధంలో ఎవరిశైలి వారిది. అయితే చంద్రబాబుకంటే వైఎస్సార్ లో ఎగతాళి పాలు కాస్తంత ఎక్కువే. ముఖంమీద నవ్వుచెదరకుండానే విమర్శనాస్త్రాలు అలవోకగా విసిరేవారు. ఇలాంటప్పుడు బాబు కంగుతిన్నమాట నిజమే. `ఈ విషయంలో వైఎస్సార్ దిట్ట’ అంటూ కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తమ నాయకునికి కితాబు ఇచ్చింది. చాలా సందర్భాల్లో నిండుసభలోనే వైఎస్సార్ `ఏం మాట్లాడుతున్నావ్ బాబూ, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా ? కాస్త వాస్తవాలేమిటో తెలుసుకో… తర్వాత మాట్లాడుదువుగాన్లే… ‘ అంటూ మెత్తగా చురకలేసేవారు. ఇక చంద్రబాబుకు ఇలాగా ఎగతాళితో సెటైర్లు వేసే నైజం అబ్బకపోయినా, సమగ్ర విషయ సేకరణతో వైఎస్సార్ ని ఢీకొనేవారు. చివరకు ఎవరిది పైచేయి అంటే, చెప్పలేని పరిస్థితి ఉండేది. వైఎస్సార్ ఒక్కోసారి, బాబుని `నువ్వు కూర్చో…’ అంటూ స్కూల్ హెడ్ మాస్టర్లా ప్రవర్తించేవారు. వైఎస్సార్ వాగ్దాటికి బాబు కంగుతిన్నప్పటికీ బాబు తేరుకుని సమర్థవంతంగా ప్రతిసవాల్ విసిరేవారు. ఒక్కోసారి ఈ వాగ్యుద్ధం మితిమీరి కుటుంబవ్యవహారాలదాకా పోయేది. వ్యవహారం దారితప్పుతున్నదని తెలుసుకునేలోపే కొన్ని పరుష మాటలు దొర్లేవి. అయినా వాటిని ఇద్దరు మహానేతలు మరచిపోయేవారు. సభలో ఏదైనా కీలక అంశంపై చర్చ జోరుగా సాగుతున్నదంటే గ్యాలరీలో కూర్చున్న వీక్షకులు ఈ సన్నివేశాలను ఒక ఉత్కంఠ కలిగించే డ్రామాలాగా చూస్తుండిపోయేవారు.
నేడు జగన్ Vs బాబు
సీను మారింది. వైఎస్సార్ బదులు ఆయన కుమారుడు జగన్ ఎపీ సభలో కీలకపాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు సభలో ఆ తండ్రికి బదులు కొడుకుని సభలో బాబు ఎదుర్కోవలసి వస్తున్నది. వైఎస్సార్ – చంద్రబాబు రాజకీయంగా సమఉజ్జీలు. పైగా ఒకప్పటి స్నేహితులు. వారిమధ్య రాజకీయకక్షలు ఎన్నిఉన్నా, చొరవ కూడా అంతే ఉండేది. కనుక పెద్దంతరం, చిన్నంతరం అన్న పాయింట్ వారినడుమ వచ్చేదికాదు. ఈ వాగ్యుద్ధాలు వారిద్దరికి సరిపడింది. అయితే, ఇప్పుడు పరిస్థితి అలాలేదు. బాబు రాజకీయ అనుభవంతో జగన్ ని పోల్చలేము. దీంతో బాబుకి జగన్ ఓ పిల్లాడిలా కనిపించవచ్చు. మరో పక్క జగన్ రాజకీయాల్లో ఫాస్ట్ కోర్స్ తీసుకుని చకచకా ఎదుగుతున్నాడు. అందుకే తననితాను చిచ్చర పిడుగుగా భావించుకుంటున్నాడు. తన సత్తా నిరూపించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇదే ఆయనకు ప్లస్ పాయింట్.
మొన్నటి ఏపీ ఎన్నికల్లో బాబుకు జగన్ గట్టిపోటీనే ఇచ్చారు. మరోమాటలో చెప్పాలంటే, బాబుకు ముచ్చెమటలు పట్టించారు. చివరకు గట్టి ప్రతిపక్షంగా తన పార్టీని నిలబెట్టారు. రాజకీయంగా విశేష అనుభవం లేకపోయినప్పటికీ, జగన్ ని `ఏదో పిల్లకాకిలే…’ అన్నట్లుగా తీసిపారేయలేని పరిస్థితి. కానీ, చంద్రబాబు దృష్టిలో మాత్రం జగన్ ఎదిగీఎదగని రాజకీయ నాయకునిలాగానే కనబడుతున్నారు. నిన్నటి సభాకార్యక్రమాల్లో చంద్రబాబు ప్రదర్శించిన ముఖకవలికలు, పెదవి విరుపులు, కనుబొమ్మల కదలికలు…ఇవన్నీ `నీకేం తెలుసు, నువ్వో పిల్లకాకివి’ అన్నట్లే ఉన్నాయి. వీలు చిక్కితే `ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలోయ్…’ అంటూ క్లాస్ పీకాలన్నట్లుంది బాబు వైఖరి. నానా రభస మధ్య క్లాస్ లు పీకే సమయం చిక్కలేదు. అందుకేనేమో, తన పార్టీ ఎమ్మెల్యేలకు `మీరు మాత్రం హందాగా వ్యవహరించండి’ అంటూ పాఠాలు చెప్పారు.
ఇదో చిత్రమైన పరిస్థితి. `పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ’ అని చంద్రబాబు అనుకుంటుంటే, మరో పక్క జగన్ మాత్రం – `నూరు గుడ్లను తిన్న రాబందు గాలివానకే గోవింద’కొట్టలేదా అనుకుంటూ చెలరేగిపోతున్నారు. మరి చివరకు ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే.
– కణ్వస