ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాళ్ల పెత్తనమేంటి ? అనే చర్చ ఇప్పుడు ఏపీలో ఊపందుకుంటోంది. ఏ పదవులు ఇచ్చినా తెలంగాణ వారికి జగన్ ఠంచన్‌గా అవకాశాలు కల్పిస్తున్నారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎం జగన్ తెలంగాణ వాసుల్ని ఉద్దరించేందుకు ప్రయత్నిస్తూండటం.. దానికి బీసీ కలర్ వేయడం.. చర్చకు కారణం అవుతోంది. బీసీలకు చాన్సులే ఇవ్వాలనుకుంటే.. ఏపీలో బీసీల్లేరా అనే వాదన వినిపిస్తోంది. రెండు రాజ్యసభ స్థానాలను తెలంగాణకు ఇవ్వడం ఒక్కటే కాదు.. గతంలో ఇచ్చిన పదవుల విషయాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
ఇటీవల మంత్రివర్గాన్ని జగన్ విస్తరిస్తే… తెలంగాణ బిడ్డ విడదల రజనీకి కీలకమైన శాఖను కేటాయించారు. విడదల రజనీ అచ్చ తెలంగాణ వ్యక్తి. సలహాదారుల్లో చాలా మంది తెలంగాణ వారే. పని లేదని రాజీనామా చేసిన కొండుభట్ల రామచంద్రమూర్తి దగ్గర నుంచి దేవులపల్లి అమర్ వరకూ చాలా మంది ఉన్నారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ దగ్గర నుంచి సలహాదారుల వరకూ.. చాలా మందిని తెలంగాణ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఐటీ సలహాదారుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు. ఏపీ సెక్రటేరియట్‌కు వెళ్తే సగం మంది తెలంగాణ వారు సాక్షి మీడియాలో పని చేసి.. ప్రభుత్వం తరపున పని చేసే వారు కనిపిస్తారు. కేసీఆర్ మీద కోపంతో ముందే రిటైర్మెంట్ తీసుకున్న ఓ ఐపీఎస్ అధికారికి జగన్ విద్యాశాఖ సలహాదారు పదవి ఇచ్చారు. మరో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలంగాణకు చెందినవారే. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు.
ఏదో ఓ సారి.. రెండు సార్లు అయితే ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ప్రతీ సారి అదే పరిస్థితి కనిపిస్తూండటంతో ఇప్పుడిప్పుడే ఏపీలో చర్చ ప్రారంభమవుతోంది. కొన్ని ప్రజాసంఘాలు నిరసనలు కూడా ప్రారంభించాయి. ఏపీ బీసీలను జగన్ ఘోరంగా అవమానిస్తున్నారని కొందరు.. ఏపీ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ముందు .. రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇవి అంతకంతకూ పెరిగితే… బీసీ సెంటిమెంట్ కాస్తా.. రాష్ట్ర సెంటిమెంట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.