విజయసాయిరెడ్జి అంటే.. వైసీపీలో నెంబర్ టూ. ఎన్నికల్లో విజయం సాధించే వరకూ పార్టీలో ఆయనేది చెబితే అది. జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకునేవారు కాదు.కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నియోజకవర్గ స్థాయి నేతలు.. ఎమ్మెల్యేలతో లొల్లి పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ పిలిచి మందలించే స్థాయికి ఆయన పరిస్థితి దిగజారిపోయింది. విశాఖలో రెండు రోజుల కిందట జరిగిన డీడీఆర్సీ సమావేశంలో నేతల వాదులాట ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన అందర్నీ పిలిపించారు.
విజయసాయిరెడ్డితో పాటు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్లను పిలిపించి మాట్లాడారు. ధర్మశ్రీ, అమర్నాథ్.. అధికారులు విజయసాయిరెడ్డి మాటే వింటున్నారని తమను లెక్క చేయడం లేదని ఫిర్యాదు చేశారు. బహిరంగంగా మాట్లాడటం సరి కాదని ఎమ్మెల్యేలకు జగన్ తేల్చి చెప్పారు. అయితే నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలియవచ్చింది. అధికారులు తమ మాట వినడంలేదని, నేటికీ కొంతమంది తెలుగుదేశం వాళ్లు చెప్పిన మాట వింటున్నారని.. విజయసాయిరెడ్డి కూడా తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఇటువంటి అంశాలు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇక ఏదైనా తన దృష్టికి తీసుకు రావాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
విజయసాయిరెడ్డిని కూడా జగన్ పిలిచి చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. అందరినీ కలుపుకు వెళ్లాలని విజయసాయిరెడ్డికి సూచించినట్టు చెబుతున్నారు. సుమారు గంటపాటు జరిగిన పంచాయతీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం, ఎవరి వాదనలు వారు వినిపించడంతో ప్రస్తుతానికి వివాదం పరిష్కారమైనట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సాదాసీదా నేతల్లా.. విజయసాయిరెడ్డికి జగన్ క్లాస్ పీకడం ఏమిటన్నది వైసీపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనే అందరికీ క్లాస్ పీకే రేంజ్ నుంచి.. క్లాస్ పీకించుకునే స్థాయికి దిగజారిపోయారా అన్న చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర వైసీపీలో ఇప్పటి వరకూ ఒకే ఒక్కడన్నట్లుగా విజయసాయి ఉన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సంకేతాలు పంపడానికే.. జగన్ పిలిపించారన్నచర్చ కూడా నడుస్తోంది.