ఆంధ్రప్రదేశ్ లో తెదేపా, భాజపాలు మిత్రపక్షాలు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కూడా ఉన్నాయి. కానీ తరచూ ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకొంటూనే ఉంటాయి. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం వంటి హామీల అమలుపై తెదేపా నేతలు అప్పుడప్పుడు కేంద్రాన్ని నిలదీస్తుంటారు. అప్పుడు వెంటనే రాష్ట్ర భాజపా నేతలు రంగంలో దిగి ప్రతివిమర్శలు చేస్తుంటారు.
భాజపాతో వైకాపాకి మిత్రత్వం లేదు. కానీ ఒకవేళ తెదేపాతో విడిపోతే భాజపా తప్పనిసరిగా తమతోనే జత కడుతుందనే నమ్మకం లేదా ఆశ జగన్ లో ఉంది. బహుశః అందుకే జగన్ ఏనాడూ కేంద్రాన్ని నిలదీసి ప్రశ్నించరు. ఏనాడు నోరు తెరిచి విమర్శించరు. ప్రత్యేక హోదా కోసం డిల్లీ వెళ్లి ధర్నా చేసినా, గుంటూరులో దీక్ష చేసినా చంద్రబాబు నాయుడినే విమర్శిస్తుంటారు.
బహుశః ఆ ముందుచూపుతోనే కేంద్రమంత్రులు కూడా జగన్ అడగగానే అపాయింట్ మెంట్ ఇచ్చేస్తుంటారు. అది మిత్రధర్మానికి వ్యతిరేకమని తెలిసినప్పటికీ, చంద్రబాబు గురించి జగన్ చేసే పిర్యాదులన్నీ చెవులు రిక్కించి మరీ శ్రద్దగా వింటుంటారు. చంద్రబాబు అవినీతి గురించి తెలియజేస్తూ జగన్ అచ్చేసిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని వారు చాలా సంతోషంగా స్వీకరిస్తారు…భద్రంగా దాచుకొంటారు. అందుకు తెదేపా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు తెదేపాపై రాష్ట్ర భాజపా విరుచుకుపడుతుంది.
ఇప్పుడు ఈ మూడు పార్టీల తీరుని కలిపి గమనిస్తే, మిత్రపక్షమైన తెదేపా కంటే భాజపాతో వైకాపాయే స్నేహంగా ఉందని అర్ధమవుతోంది. అదేవిధంగా మిత్రపక్షమైన తెదేపాతో కంటే వైకాపాతోనే భాజపా స్నేహంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఒకవేళ తెదేపా, భాజపాలు విడిపోతే, భాజపాపై సందించడానికి తెదేపా వద్ద చాలా ‘విభజన అస్త్రాలు’ సిద్దంగా ఉన్నాయి. అలాగే భాజపా వద్ద కూడా ‘అవినీతి అస్త్రాలు’ ఉన్నాయి. కానీ ఈ ఐదేళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెగ పొగిడేసిన తరువాత, అకస్మాత్తుగా ఎన్నికలలో ఆయనని విమర్శిస్తే ప్రజలు అంగీకరిస్తారా? ఏమో! కనుక తెదేపా ‘సేఫ్’ గానే ఉన్నట్లు అనుకోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో అవి రెండూ కలిసి కొనసాగినట్లయితే అప్పుడు ఆ రెండూ కలిసి వైకాపాపై దాడి చేయడం తధ్యం.
భాజపాతో స్నేహం కోసం ఎదురుచూపులు చూస్తూ హామీల అమలుగురించి కేంద్రాన్ని నిలదీయకుండా ఐదేళ్ళు గడిపేసి, ఎన్నికల సమయంలో కేంద్రాన్ని, భాజపాని జగన్ నిలదీసినా ప్రజలు నమ్ముతారా…ఏమో? ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే విమర్శలు చేస్తున్నారు కనుక అవి పూర్తయిన తరువాత మళ్ళీ ఎప్పటిలాగే మౌనం వహిస్తారని ప్రజలు భావిస్తే ఆశ్చర్యం కాదు. ఇప్పుడు వాటి గురించి మాట్లడనప్పుడు అప్పుడు వాటి గురించి మాట్లాడే అవకాశమే వైకాపాకి ఉండదు.
ఒకవేళ ఎన్నికలకి ముందు భాజపాతో వైకాపా జత కడితే వాటి గురించి మాట్లాడే అవకాశం అసలే ఉండదు. అప్పుడు విభజన హామీల అమలు గురించి ఇదివరకులాగ చంద్రబాబుని నిలదీసే అవకాశం కూడా ఉండదు. పైగా తెదేపాయే జగన్మోహన్ రెడ్డిని ఎదురు ప్రశ్నిస్తే దానికి జవాబులు చెప్పుకోలేక ఇబ్బంది పడవచ్చు. ఒకవేళ విభజన హామీలని ఎన్నికలలో ప్రధాన అంశంగా మార్చడంలో తెదేపా సఫలం అయినట్లయితే, భాజపాతో జత కట్టినందుకు వైకాపా కూడా నష్టపోవచ్చు. కనుక జగన్ కూడా రెండు రకాల సమీకరణాలకి సరిపోయే విధంగా ఇప్పటి నుంచే వ్యవహరించడం మంచిది.