రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు తెస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అదేదో దొంగతనం చేస్తున్నామంటూ కథనాలు రాయడం ఏంటనీ, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వారి మీడియా కథనాలు ఉంటున్నాయని ఆయన మాట్లాడారు కదా! ఈ వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. ప్రతిపక్ష నేతపై బురద చల్లే కార్యక్రమాన్ని చంద్రబాబు పెట్టుకున్నారనీ, సీఎం ఆలోచనలు మారాలని ఆయన విమర్శలు గుప్పించారు.
పోతిరెడ్డిపాడు జల వినియోగం గురించి అన్ని మీడియా సంస్థలూ కథనాలు రాశాయని అంబటి చెప్పారు. సాక్షి పత్రిక కూడా అదే క్రమంలో రాసిందనీ, సాక్షిలో ఒక కథనం వస్తే.. అది జగన్ వాదన ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నించారు! మీడియాలో వచ్చే కథనాలను వ్యక్తులకు ముడిపెట్టడం అనేది సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే పత్రికలు, ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను ప్రతిబింబించేలా వార్తలు రాయడంలో తప్పేముందని నిలదీశారు. ఈ సందర్బంగా చంద్రబాబు ఆహారపు అలవాట్ల గురించి కూడా అంబటి ఎద్దేవా చేసేలా మాట్లాడారు. ఆయన సాత్వికాహారం తింటున్నట్టు చెప్పుకున్నారనీ, దాన్లో తప్పులేదుగానీ రాజకీయంగా ఆయన మాంసాహారి అంటూ విమర్శించారు. గడచిన మూడేళ్ల పాలనలో లక్షల కోట్లను అక్రమంగా తినేశారంటూ ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలను మింగేశారు అన్నారు. సీఎంకి మానసిక పరిస్థితి సరిగాలేదనీ, ప్రతిపక్ష నేత జగన్ పై అవాకులూ చవాకులూ తగ్గించుకోవాలని సూచించారు!
సరే, అంబటి చేసిన విమర్శల్ని కాసేపు పక్కన పెడితే.. సాక్షి పత్రికలో వార్త వస్తే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఎలా అవుతుందని ప్రశ్నించడమే.. సెల్ఫ్ గోల్ చేసుకునే తరహా కామెంట్ అనొచ్చు! పత్రికలో వచ్చే కథనాలను వ్యక్తులకు అంటగట్టొద్దు అనడమూ అలాంటి వ్యాఖ్యే! అంటే, పార్టీతో పత్రికకు ఏమాత్రం సంబంధం లేదని చెబుతున్నట్టుగా ఉంది. సాక్షి ఉన్నదే వైకాపా కోసం, నడుస్తున్నదే జగన్ కోసం అనే విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఆ పత్రికలో ప్రచురితం అయ్యే న్యూస్, వ్యూస్ ఏవైనా అన్నీ పార్టీకి అనుకూలంగానే ఉంటాయి! అందులో ఏ కథనం వచ్చినా.. దాన్లో వ్యక్తీకృతం అయ్యే అభిప్రాయం వైకాపా మనోగతంగానే ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలుగుదేశం సర్కారుపై వచ్చే నెగెటివ్ స్టోరీలన్నింటిలోనూ ప్రతిపక్ష పార్టీ అభిప్రాయమే ధ్వనిస్తుంది. అలాంటప్పుడు ఇలా విడిదీసి అంబటి మాట్లాడటం ఎంతవరకూ సరైందనేది వారికే తెలియాలి! అంతేకాదు, పోతిరెడ్డిపాడు నీటి విషయమై వ్యక్తీకరించిన అభిప్రాయం తెలంగాణకే పరిమితం అని చెబుతూ, ఆంధ్రాకు విషయంలో వైకాపా చేస్తున్న ఆరోపణలపై వెనక్కి తగ్గిన సంకేతాలు కూడా అంబటి వ్యాఖ్యల్లో వినిపిస్తున్నాయనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది!