ఆంధ్రుల అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఆంధ్రా సెంటిమెంట్ బలంగా పనిచేసింది. ఆ తరువాత, ఇప్పుడు ప్రత్యేక హోదా సెంటిమెంట్… ఇది కూడా తీవ్రంగానే ఉంది. హోదాకి బదులు ప్యాకేజీ ఇస్తామని చెప్పి, దాన్ని కూడా కేంద్రం ఎలా నిర్లక్ష్యం చేసిందో ప్రజలు గమనిస్తున్నారు. పైగా, తాజా కేంద్ర బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలకు ఉన్న హోదాను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గతంలో ప్యాకేజీకి ఆమోదించిన టీడీపీ సర్కారు కూడా కేంద్రాన్ని మరోసారి హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఇతర రాష్ట్రాలకు హోదా పెంచే వెసులుబాటు ఉన్నప్పుడు ఆంధ్రాకి హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలనే డిమాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరమీదికి తెచ్చారు. దీంతో ఇతర పార్టీలు కూడా ఇప్పుడు ‘ప్రత్యేక హోదా’ నినాదాన్ని వినిపిస్తున్నాయి.
అయితే, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఈ సమయంలో సెంటిమెంట్ ను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునే క్రమంలో ఉన్నట్టున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సెంటిమెంట్ దగ్గర నుంచీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ సమయంలో విభజన వద్దు అని మొత్తుకున్న ఏకైక పార్టీ తమదే అని జగన్ చెప్పారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని తానే గడచిన నాలుగేళ్లుగా బతికించుకుంటూ వస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్ష చంద్రబాబుకి అర్థమైందనీ, మంత్రుల రాజీనామాతో చేయించడం ప్రజల విజయంగా అభివర్ణించారు. ఈ నెల 21న ప్రవేశ పెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలనీ, వారు ఆలోచించుకోవడం కోసమే 21 వరకూ టైమిచ్చామన్నారు. ఒకవేళ వారు అవిశ్వాసం పెట్టినా తాము మద్దతు ఇస్తామన్నారు.
కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం ప్రజల విజయం అని ఎలా అంటారు..? టీడీపీ సర్కారుకీ ప్రజలకీ మధ్య జరుగుతున్న పోరాటం కాదు కదా ఇది..? తాజా పరిణామాలకు ఆ కోణం ఆపాదించాల్సిన అవసరం ఏముంది..? వారు ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానమే అంతిమ పోరాటంగా చెబుతున్నారు. టీడీపీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జగన్ కి అర్థంకాని విషయం ఏంటంటే… కేంద్రంపై కక్ష సాధింపు ధోరణిలో టీడీపీ వెళ్లడం లేదు! మంత్రుల రాజీనామాలు ఆయనకి అలా అర్థమౌతేందేమో మరి. ఏదో ఒక మార్గం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రయోజనాలు రాబట్టుకోవడం మాత్రమే ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. దాన్లో భాగమే కేంద్ర మంత్రుల రాజీనామా. దశలువారీగా జరగాల్సిన పరిణామాలు కొన్ని ఉంటాయి. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే అంతిమంగా అధికార పార్టీగా టీడీపీ చేయాల్సింది చేస్తుంది. అంతేగానీ, అవిశ్వాసం ఒక్కటే కేంద్రం మెడలు ఒంచే అస్త్రం కాదు కదా. కేంద్రం మోసం చేసిందన్న భావన ప్రజల్లో చాలా బలంగా ఉంది. దాన్ని టీడీపీపై వ్యతిరేకతగా చిత్రించాలనే ప్రయత్నం జగన్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.