అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ సర్కార్… సీబీఐ విచారణకు ఆదేశించాలన్న యోచన చేస్తోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి వర్గ ఉపసంఘ నివేదికను కేబినెట్‌ను అందించారు. దీన్ని పరిశీలించిన తర్వాత సీబీఐకి అప్పగిస్తామని… పేర్ని నాని మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. హైకోర్టు జడ్జితో అయినా… సీబీఐతోనైనా విచారణ చేయించాలన్నారు. సీబీఐ విచారణను మూడు నెలల్లో పూర్తయ్యేలా కేంద్రాన్ని కోరాలన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే కఠినంగా శిక్షించాలన్నారు. అదే సమయంలో… విశాఖలో మీ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు.
విశాఖలో వైసీపీ నేతల ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని బయటపెడుతుంటే.. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటున్నారని విమర్శలు గుప్పించారు. సీబీఐ విచారణపై జగన్‌కు అంత గౌరవం ఉంటే.. శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని జగన్ ప్రశ్నించారు. తన కేసులపై విచారణ కోరుతూ సీబీఐకి జగన్ లేఖ రాయొచ్చు కదా అని మండిపడ్డారు. వివేకా కేసులో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదన్నారు. ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని.. తాము ఏ తప్పు చేయలేదన్నారు. మాపై కక్ష తీర్చుకోవాలనుకుంటే మీ వల్ల ఏమీ కాదని స్పష్టం చేశారు. 7 నెలలుగా తవ్వుతున్నాం అంటున్నారు ఏం బయట పెట్టారని ప్రశ్నించారు.
అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన భూముల వివరాలతోనే.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీటిలో కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలో ఉన్నవి.. ఇన్ సైడర్ ట్రేడింగ్‌గా భావించే.. టీడీపీ గెలుపొందిన తేదీ దగ్గర్నుంచి రాజధాని ప్రకటించే తేదీకి మధ్య చాలా పరిమితమైన లావాదేవీలే ఉన్నాయి. హెరిటేజ్ సంస్థ కంతేరు గ్రామంలో భూములు కొనుగోలు చేసింది. అది కోర్ క్యాపిటల్ ఏరియాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. మిగతా నేతలపైనా ఆరోపణలు చేశారు. అందరూ ఆ భూములు తమవని నిరూపిస్తే.. ప్రభుత్వానికే ఇచ్చేస్తామన్నారు. వీటిపైనే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది.