తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రణాళికాబద్దమైన పరిపాలన ప్రారంభించారు. కేంద్రంపై ఆయన దృక్పధంలో ఏ మాత్రం మార్పు రాలేదు. తమిళనాడు ప్రయోజనాల కోసమే ఆయన పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ విధానంపై ఆయన తిరగబడ్డారు. ఇప్పుడు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై మరో విధంగా తిరగబడాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను హరించే క్రమంలో అనేకానేక బిల్లులను తీసుకు వస్తోంది. అపరిమితంగా ఉన్న బలం… తమ పార్టీతో జట్టు కట్టనప్పటికీ… వివిధ కారణాలతో ఏం చేసినా ఆమోదించే ప్రభుత్వాలు ఉన్న కారణంగా బీజేపీకి … రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడం కామన్‌గా మారింది.
ఈ క్రమంలో కొత్తగా కేద్రం పోర్టుల బిల్లు కూడా తీసుకు వచ్చింది. ఈ బిల్లు ప్రకారం చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు కట్టబెడతారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్డీసీ గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. కొత్త బిల్లు ద్వారా వాటిని కేంద్రం తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది తీర ప్రాంత రాష్ట్రాల హక్కులను హరించడమే. అందుకే స్టాలిన్ రంగంలోకి దిగారు. తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు.
రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని… రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను గురువారం సమావేశంలో కేంద్రానికి తెలియజేయాలని స్టాలిన్ లేఖలో కోరారు. జగన్‌తో సహా పోర్టులు ఉన్న ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అందులో గుజరాత్, గోవా, కర్ణాటక, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో వారు అపోజ్ చేయడం ఉండదు. కేరళ, బెంగాల్ తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం. అందుకే అందరి చూపు.. ఒడిషా, ఏపీలపైనే ఉంది. ఈ ఇద్దరు సీఎంలు తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారో… బిల్లులకు మద్దతిస్తారోనన్న టెన్షన్ ప్రారంభమయింది. కేంద్రానికి వ్యతిరేకంగా బయట అభిప్రాయాలు వ్యక్తం చేయడం.. బిల్లులకు మద్దతు తెలియచేయడం వంటి వ్యూహాలను జగన్ ఇప్పటి వరకూ పాటించారు. ఈ పోర్టుల విషయంలో ఏం చేస్తారోనన్న ఆసక్తి ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఏర్పడింది.