వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజయిన గురువారం నాడు జగన్మోహన్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని తన విమర్శలతో ఉతికి ఆరేసాక, చివరిగా హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయేముందు అన్ని విధాల భ్రష్టు పట్టిన తెరాస ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయమని తెలంగాణా ప్రజలకు ఒక ఉచిత సలహా ఇచ్చేరు.
సరిగ్గా ఆరు నెలల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికలలో ఇదే తెరాస పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు. అప్పటికే తమ వద్ద ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరినీ తెరాస పార్టీయే లాగేసుకొంది. మరొకరయితే అందుకు తెరాసపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ జగన్ అదే తెరాసకు మద్దతు ఇచ్చేరు. ఎందుకంటే తెదేపాకు బుద్ధి చెప్పడానికట! అంటే తెలంగాణాలో తెదేపాను అడ్డుకోవడానికే వైకాపా, తెరాసలు రహస్య అనుబంధం కొనసాగిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి స్వయంగా దృవీకరించినట్లే అయింది. కానీ ఈసారి తెరాస ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయమని ప్రజలకు సలహా ఇస్తున్నారు.
ఈ ఆరు నెలల వ్యవధిలో తెరాస పట్ల ఆయన వైఖరిలో మార్పు వచ్చిందనుకోవాలా..లేకపోతే కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు ఆరోపిస్తున్నట్లుగా ఈ ఉప ఎన్నికలలో ప్రతిపక్షాల ఓట్లు చీల్చి అధికార తెరాసను గట్టెకించడానికే అంత శ్రమ తీసుకొని ఎన్నికల ప్రచారం చేసారా? అనే అనుమానాలు కలగడం సహజం.
తెరాస పట్ల ఆయన వైఖరిలో మార్పు వచ్చిందనుకోవడానికి ఒకే ఒక కారణం కనబడుతోంది. అదే..ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల మధ్య చిగురిస్తున్న స్నేహం. ఇంతకాలం తనతో సఖ్యతగా ఉన్నా కేసీఆర్ ఇప్పుడు తమా ఇద్దరి బద్ద విరోధి అయిన చంద్రబాబు నాయుడుకు దగ్గరవడం ఆయన జీర్ణించుకోవడం కష్టమే. కానీ తెలంగాణాలో తెరాసను తెదేపా సవాలు చేస్తునంత కాలం ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కుదరడం కష్టమే. కనుక వారి మధ్య చిగురించిన ఈ కొత్త స్నేహ పుష్పం ఏ రాజకీయ వడగాడ్పులు సోకినా వాడిపోయే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. కనుక వారి స్నేహం గురించి జగన్మోహన్ రెడ్డి నిశ్చింతగా ఉండవచ్చును. బహుశః ఆ సంగతి ఆయనకీ తెలిసే ఉంటుంది.
మరి అది కారణం కానప్పుడు రెండవ కారణం చేతనే ఆయన ఈ ఉప ఎన్నికల బరిలో తన అభ్యర్ధిని నిలబెట్టినట్లు అనుమానించవలసి ఉంటుంది. తెలంగాణాలో కూడా వైకాపా ఉంది కానీ ఆ పార్టీ నేతలు ఈ 16నెలలలో ఏనాడూ కూడా జగన్ ఈ నాలుగు రోజుల్లో అడిగిన ప్రశ్నలను అడగలేదు. ఇన్నాళ్ళుగా మౌనం వహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా సమస్యలన్నీ ఏకరువు పెట్టి, తెరాస ప్రభుత్వం వాటినన్నిటినీ పరిష్కరించడంలో విఫలమయింది కనుక దానిని బంగాళాఖాతంలో విసిరేయమని తెలంగాణా ప్రజలకు ఉచిత సలహా ఇవ్వడం చాల హాస్యాస్పదంగా ఉంది.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో కూడా తన పార్టీని బలోపేతం చేసుకొని ఎన్నికలలో పోటీ చేసి అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యమే ఉన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవిధంగా పోరాడుతున్నారో అదేవిధంగా తెలంగాణాలో కూడా తన పార్టీని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడమని ప్రోత్సహించి ఉండేవారు. కానీ దానివలన తెరాసతో తన రహస్య అనుబంధం చెడిపోయే ప్రమాదం ఉంది కనుక ఆయన తెలంగాణా వైకాపా నేతల చేతులు కట్టేశారని చెప్పవచ్చును. కనుక ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన పదేపదే చెప్పిన రాజకీయాలలో నైతిక విలువలు, విశ్వసనీయత, మాట తప్పనితనం వంటి పదాలేవీ ఆయనకు సరిపోవు. ఆయనలో సరిగ్గా అవే లక్షణాలు లోపించాయని భావించవలసి ఉంటుంది.