ఏపీ సీఎం జగన్‌కు వ్యక్తిగతం.., రాజకీయం అంటూ ఏమీ ఉండదు. రాజకీయమే వ్యక్తిగతం. రాజకీయ ప్రత్యర్థి అయితే వ్యక్తిగత శత్రువే. అందుకే ఆయన విపక్ష నేతలను వ్యక్తిగత శత్రువులుగానే చూస్తారు. మానసికంగా వేధిస్తారు. కేసులు పెట్టి హింసిస్తారు. అలా ఎందుకు చేస్తారంటే రాజకీయంగా విమర్శించడమే కారణం. చంద్రబాబును కూడా అంతే ద్వేషిస్తారు. ఆయనపై జగన్‌కు ఎంత కసి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అలాంటి చంద్రబాబుతో కలిసి కూర్చోవాల్సిన పరిస్థితి జగన్‌కు ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరో తేదీన ఢిల్లీ వెళ్లబోతున్నారు. “అజాదీ కా అమృత్ మహోత్సవ్” జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇదే్ సమావేశానికి ముఖ్యమత్రి హోదాలో ఏపీ సీఎం జగన్‌కూ ఆహ్వానం అందింది. జగన్ కూడా.. ఈ సమావేశానికి వెళ్లాల్సి ఉంది. ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి తప్పనిసరిగా వెళ్లాలి. లేకపోతే మోదీని.. అమృత్ ఉత్సవాల్నీ అగౌరవ పర్చినట్లు అవుతుంది. చంద్రబాబును ఆహ్వానిస్తారని జగన్ అనుకుని ఉండరు.
అసెంబ్లీలో చంద్రబాబు , జగన్ ఒకే సమావేశంలో కనిపించారు. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులు అవమానించడంతో చంద్రబాబు కంటతడి పెట్టుకుని వెళ్లిపోయారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేశారు. ఈ అసెంబ్లీ కాలంలో ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. అంటే మరోసారి అసెంబ్లీలోనూ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మాత్రం కలిసి పాల్గొంటారు. రాజకీయాన్ని రాజకీయంగానే చూసే చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.కానీ రాజకీయాన్ని కూడా వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి పెంచుకునే జగన్‌కు మాత్రం ఈ భే్టీ ఇబ్బందికరమే. వెళ్తారో.. చివరి క్షణంలో డుమ్మా కొడతారో వేచి చూడాలి.