ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం సర్కారుపై విపక్షం పోరాటం ఒక అడుగు వెనక్కే ఉందన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. జగన్ స్పందించాల్సిన సందర్భాల్లో పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేస్తూ ఉండటం చూస్తున్నాం. పవన్ టేకప్ చేసిన ఇష్యూపై తెలుగుదేశం సానుకూలంగా స్పందించడం, ఆ తరువాత పవన్ సైలెంట్ అయిపోవడం… ఇదీ చూస్తున్నాం! ఈ నేపథ్యంలో విపక్ష వైకాపా వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపై పోరాడే తీరును పునః సమీక్షించుకోవాలని చాలామంది అంటుంటారు. ఇంకా పాత విధానాలనీ వాదనలనీ పట్టుకుని వేలాడుతుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రైతు భరోసా సభలు నిర్వహిస్తున్నారు వైయస్ జగన్. కర్నూలు జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో కరువు గురించి మాట్లాడారు.
నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టాక వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్రంలో కరువు వచ్చిందని చెప్పారు. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు కాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారనీ, పంటలకు మద్దతు ధర లభించక రైతులు అప్పులపాలౌతున్నారనీ, వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే రైతులను ఎద్దేవా చేసే విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉంటోందని జగన్ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఇలాంటి మోసగాళ్లు బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుందని జగన్ అన్నారు.
నిజానికి, చంద్రబాబు వస్తే కరువు వస్తుందనే ఓ సెంటిమెంటల్ ప్రచారానికి ఇప్పుడు ప్రజల్లో అంత స్పందన ఉందా అనేది ప్రశ్నార్థకం? ఒకవేళ ఉన్నా వైకాపాకి ఏమాత్రం మైలేజ్ ఇవ్వని విమర్శ ఇది. ఇంకోటీ… జగన్ ప్రసంగంలో ప్రతీసారీ ముఖ్యమంత్రిని సాగనంపాలీ, పదవి నుంచి దించాలనే అభిప్రాయం ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అంటే, ఇది ఎన్నికల స్పీచ్ అనే భావన ప్రజలకు కలిగే అవకాశం ఉంది కదా! ప్రస్తుతం వైకాపా చేసే పోరాటం ఏదైనాసరే అది ఆ అంశానికే పరిమితమైతే బాగుంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. బాబు వస్తే కరువు వస్తుందన్న సెంటిమెంట్ వాదన మార్చుకుంటేనే బెటర్ అంటున్నవారూ లేకపోలేదు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, సర్కారు వైఫల్యాలు చాలానే ఉన్నాయి. వాటిని ఫోకస్ చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వీటిపై పోరాటాలు చేసుకుంటూ పోతే ఎవరిని సాగనంపాలో ప్రజలకే అర్థమౌతుంది. అల్టిమేట్‌గా చేయాల్సింది వారే చేస్తారు.