మళ్లీ జగన్నే సీఎం చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు బస్సు యాత్రలో ఆగిన చోటల్లా విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్ సామాజిక న్యాయం చేస్తారని అంటున్నారు. సామాజిక న్యాయం అంటే ఏమిటో అందరికీ తెలుసో లేదో కానీ మళ్లీ జగన్నే సీఎం చేయాలంటూ మంత్రులు అడుగుతున్న వైనం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు. మరో రెండు రోజులకు మూడేళ్లు నిండుతాయి. ఇంకా రెండేళ్లు ఉండగానే జగన్ ను సీఎం చేయాలంటూ మంత్రులు రోడ్డెక్కడం… రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎలాగోలా బయటపడవచ్చన్న అనేక రకాల సర్వేలు వెల్లడించడంతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ నేతలందర్నీ గడపగడపకు పంపడమే కాకుండా.. . సామాజిక న్యాయం పేరుతో కొత్తగా పదవులిచ్చిన వారితో యాత్ర కూడా చేయిస్తున్నారు. ఓ రకంగా అది ఎన్నికల ప్రచారమే అనుకోవచ్చు.
వచ్చే నెలాఖరులో ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది. అక్కడ భారీ మెజార్టీ సాధించి.. వైసీపీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించడం కోసం భారీగా ప్రచారం నిర్వహింప చేసుకుని నవంబర్లో అసెంబ్లీని రద్దు చేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్లో ఉన్నారని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన సమాచారం పార్టీ నేతలుకూ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. అందుకే టీడీపీ కూడా పాలించే దమ్ము లేకే ముందస్తుకు వెళ్తున్నారని విమర్శలు చేస్తోంది.