నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అవడంతో జగన్ శిబిరంలో కలకలం మొదలైంది. తమ ప్రియతమ నాయకుడు ఏం చేయబోతున్నారన్నది తెలియక సతమతమైపోతున్నారు. అక్టోబర్ 22న విజయదశమిరోజున తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం , మందడం రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎంపికచేసిన 250 ఎకరాల స్థలంలో వైభవోపేతంగా శంకుస్థాపన జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీసహా పలువురు దేశ, విదేశీ ప్రముఖులు ఈ శంకుస్థాపన ఉత్సవసభలో పాల్గొనబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఏదోవిధంగా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది రాష్ట్రప్రజలందరి పెద్ద పండుగన్న అభిప్రాయం ఏర్పడింది. మరి ఇలాంటి ఉత్సవానికి జగన్ దూరంగా ఉంటే `ఏకాకి’గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. పోనీ వెళితే, రాజకీయంగా తన శత్రువైన చంద్రబాబు ముందు లొంగిపోయినట్లవుతుందేమోనన్న శంక జగన్ ని పీడిస్తోంది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే సమయంలో కూడా జగన్ వెళ్లలేదు. అయితే ఆ ఉత్సవాన్నీ, ఈ శంకుస్థాపన ఉత్సవాన్నీ ఒకే గాడికి కట్టేసి చూడకూడదు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇవ్వడానికి తిరస్కరించిన రైతులకు జగన్ అండగా నిల్చినమాట నిజమేకావచ్చు. తాను మఖ్యమంత్రికాగానే ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన తన చుట్టూ నాలుగుగోడలు కట్టేసి కూర్చోవడం రాజనీతి అనిపించుకోదు. కానీ జగన్ కు సలహా ఇచ్చేదవరు?
అభిమానధనుడు జగన్
జగన్ మనస్తత్వాన్ని నిశితంగా గమనించినవారు చెబుతున్నదేమంటే, జగన్ చాలా సున్నిత మనస్కుడని. ఎంతగా అంటే, తనకు నచ్చని విషయం ఏ చిన్నది జరిగినా తట్టుకోలేనంతటి సున్నిత మనస్తత్వం. ఓటమిని అంగీకరించే నైజం లేదు. సర్దుబాటు మాటలు ఉండనేఉండవు. అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఆయనమాటలతీరు ఇంచుమించు ఇలాగే సాగింది. అభిమానధనుడైన జగన్ కి ఇప్పుడు సంకట స్థితి ఎదురైంది. చంద్రబాబు పొడగిట్టని జగన్ మనసుచంపుకుని రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి వెళతారా? అన్నది సందేహమే. అయితే జగన్ మనస్తత్వం సంగతి ఎలా ఉన్నా ఈమధ్య రాజకీయనాయకునిగా కూడా ఎదగడంవల్ల అప్పుడప్పుడు కొన్ని సలహాలను పార్టీ సీనియర్ల నుంచి తీసుకుంటున్నారని అంటున్నారు. అంతమాత్రాన ఆ సలహాలు పాటించాలన్న రూలేమీలేదు. చివరకు ఆయన మనసుకుతగ్గట్టుగా చేస్తారని పార్టీవర్గాల్లోనే వినబడుతున్నమాట. ప్రధానమంత్రి మోదీ అంతటివాళ్లే వస్తున్నప్పుడు తానేదో సిద్ధాంతాలకు కట్టుబడినట్లు మూలన కూర్చుంటే, అభివృద్ధి నిరోధకుడన్న ముద్రపడే ప్రమాదం ఉంటుందన్న భయం కూడా లేకపోలేదు. ఇప్పుడేమిటి కర్తవ్యం ? వెళ్లడమా? లేక మానడమా?? ఇదీ జగన్ అంతర్మధనం. అందుకే,జగన్ ఈ సంకటస్థితినుంచి ఎలా బయటపడతారా అని పార్టీ అభిమానులు, కార్యకర్తలనుంచి నాయకగణందాకా కలవరపడుతున్నారు.
రాజధాని ఎవరిది?
రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు హడావుడి చేసినంతమాత్రాన అది పూర్తిగా ఆయన సొంతమైపోతుందా? ఈ ప్రజాస్వామిక దేశంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. రేపు మరొకరి అవకాశం రావచ్చు. అది తానే ఎందుకు కాకూడదన్నది జగన్ ఆలోచన. మరి అలాంటప్పుడు వెళితే ఏపోయిందన్నదన్న పాయింట్ విస్మరించలేనిదే. ముఖ్యమంత్రి సీటు మీద మోజుపెట్టుకున్న జగన్ ఈ కోణంలో కూడా ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది.
నవ్యాంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి ఓ విశిష్టత ఉంది. విభజనానంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు. దీంతో కొత్తగా రాజధానిని నిర్మించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పైగా రాష్ట్ర విభజన సీమాంధ్రులకు మొదటినుంచీ ఇష్టంలేదు. దీంతో వారిలో ఆత్మాభిమానం దెబ్బతింది. తమ సత్తాఏమిటో దేశానికి చాటిచెప్పాలన్న కసి ఏర్పడింది. ఈ క్రమంలో అమరావతి క్యాపిటల్ నిర్మాణ బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారు. భూసేకరణలో కష్టనష్టాలు ఎదురైనా ఓర్పుగా సమస్యలను అధిగమించారు. ఇక ఇప్పుడు కలల రాజధాని శంకుస్థాపన అంకానికి తెరతీయబోతున్నారు. చంద్రబాబు మొదటి నుంచి ఇది ప్రజల రాజధాని అనీ, దీన్ని ప్రజాసహకారంతోనే అత్యద్భుతంగా నిర్మిస్తానని చెబుతూవస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అత్యవసరం. పైగా సర్వోన్నత స్థాయిలో రాజధాని వస్తుందంటే స్వాగతించని ఆంధ్రుడు ఉండడేమో… ఇలాంటప్పుడు జగన్, ఆయన సహచర గణం గిరిగీసుకుని ఒంటరిగా ఉండటం ఏమాత్రం హర్షనీయం కాదు, ఈ సందర్బంగానైనా జగన్ అందరితో కలిసిపోవాలి. పైగా, రాజధాని అన్నది రాష్ట్ర పాలనకు కావాలసిన ప్రాధమిక సౌకర్యం. ఈ సౌకర్యమన్నది ఏ ఒక్కరి సొత్తుకాదు. ఇవ్వాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక దీన్ని ఆయన సొంతం అనుకోకూడదు. భవిష్యత్తులో జగన్ లేదా మరొకరు సీఎం కావచ్చు. ఎవరు ఆ సీట్లో కూర్చున్నా , రాజధాని అవసరమేకదా. పైగా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ రకంగా చూసినా- రాజధాని, అసెంబ్లీ ప్రాంగణం, ఇతరత్రా భవన సముదాయాలు ఆయనగారి విధినిర్వహణకు కూడా ప్రాధమిక సౌకర్యాలుగానే గుర్తించాలి. స్థూలంగా చెప్పుకోవాలంటే, కసి, కోపం, పగ వంటివి వ్యక్తులమీద చూపించవచ్చేమోకానీ, భవన సముదాయాలు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులమీద కాదన్న సున్నితమైన సత్యం గుర్తించాలి.
బాబు పిలుస్తారా ?
ఇదంతా ఇలా ఉంటే ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అపార రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు హుందాగా వ్యవహరించవచ్చు. అంటే, జగన్ కు ప్రత్యేక ఆహ్వానం అందించవచ్చు. ఎలాగూ, జగన్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, ఆహ్వానపత్రికను అధికారికంగా పంపించడాన్ని ఎవ్వరూ తప్పుబట్టలేరు. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి సహా ఇతరులను కలుసుకుని శంకుస్థాపన ఉత్సవానికి ఆహ్వానించిన బాబు త్వరలోనే జగన్ సహా ప్రతిపక్ష నేతలకు ఇతర ప్రముఖులకు అహ్వానాలు స్వయంగా పంపించవచ్చు. ఈ విషయంలో రాజకీయాలకు ఎలాంటి తావుఇవ్వకుండా ఉండాలన్నదే బాబు అభిమతమని అంటున్నారు. తన ప్రమాణస్వీకారానికి రాని జగన్ ఈసారి ఏంచేస్తారన్నది బాబుకి కూడా ఆసక్తిగా మారిన అంశంగానే చెప్పుకోవాలి. పిలిచినా జగన్ రాకపోతే దాన్ని తెలుగుదేశం తమకు ఎడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. అలాగే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా బాబు పిలిచే అవకాశం ఉంది. వెంకయ్యనాయుడులాంటి ప్రముఖుల సలహామేరకు బాబు పొరుగురాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ముఖ్యమంత్రులను సైతం బాబు ఈ ఉత్సవానికి పిలిచే అవకాశాలున్నాయి.
సో వెళ్ళాల్సిందే
రాజధాని నిర్మాణం అందరి బాధ్యత కాబట్టి, జగన్ ఈ వేడుకకు హాజరుకావాల్సిందే. అలాకాకుండా ఒంటరిగా ఉండిపోతే అది నెగెటీవ్ షేడ్ గా మారిపోతుందన్న విషయం తెలుసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ జగన్ కు ఇది నీలిలిట్మస్ పరీక్ష. మరి ఎటు మొగ్గుచూపుతారన్నది అతి త్వరలోనే తేలిపోతుంది.
– కణ్వస