సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి .. ఆ పార్టీలో సునామీ సృష్టించాలన్న లక్ష్యంతోనే కనిపిస్తున్నారు. ఆయన ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీపైనా విరుచుకు పడ్డారు. రేవంత్ రెడ్డిని తొలగించాలంటూ హైకమాండ్‌కు లేఖ రాయడమే కాదు దాన్ని మీడియాకు విడుదల చేసి .. క్రమశిక్షణ ఉల్లంఘించారని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియాతో చెప్పారు. అంతే కాదు ఆయనను పిలిచి వివరణ అడుగుతామని.. హైకమాండ్‌కు నివేదిక పంపుతామన్నారు. చర్యలు మాత్రం హైకమాండ్ తీసుకుంటుందన్నారు.
అయితే వెంటనే జగ్గారెడ్డి కూడా తెర ముందుకు వచ్చేశారు. మీడియాపై క్రమిశిక్షణా కమిటీ చైర్మన్‌పైనే మండిపడ్డారు. ఆయన ఏం చేయాలో కూడా చెప్పారు. ముందు రేవంత్ రెడ్డిని పిలిచి వివరణ అడగాలన్నారు. ఇలా ఎందుకు జగ్గారెడ్డి ఎడ్డెమంటే తెడ్డేమంటున్నారో కాంగ్రెస్‌లో చాలా మంది నేతలకు క్లారిటీ ఉంది. ఆయన వేరే దారి చూసుకోవాలనుకుటున్నారని దానికి అవసరమైన వాతావరణాన్ని ఆయన రెడీ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఇంత ఇదిగా ఆయన జగడం పెట్టుకోవాల్సిన అవసరం ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఎన్నికల మూడ్‌లోకి రాజకీయ వాతావరణం వస్తూండటంతో తన భవిష్యత్ ప్రణాళికలు అమలుచేయడానికి జగ్గారెడ్డి మరింత దూకుడుగా ఉన్నారని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన కేసీఆర్…కేటీఆర్‌ను పొగుడుతున్నారు. కానీ హరీష్ రావును మాత్రం టార్గెట్ చేస్తున్నారు. ఆయన మొదటగా ఆలె నరేంద్రతో పాటు బీజేపీలోనూ కీలకంగా పని చేశారు. ఆయన దృష్టి ఏపార్టీపైన ఉందో కానీ కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్య స్వేచ్చను మాత్రం గరిష్టంగా వాడుకుంటున్నారన్న ఆవేదన ఆ పార్టీ సీనియర్లలో కనిపిస్తోంది.