2019 ఎన్నికలకు మన కథానాయకులు ముందస్తుగానే సిద్ధమవుతున్నారు. ఎన్నికలలోపు పవన్ కల్యాణ్ దగ్గర్నుంచి ఓ ‘పొలిటికల్’ మూవీ రాబోతోందని టాక్. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో వర్మ ఓ సినిమా తీయబోతున్నారు. అదీ… పొలిటికల్ ఫీవర్లో వచ్చేదే.
వీళ్లందరి కంటే ముందస్తుగా మేల్కొంది నందమూరి బాలకృష్ణనే అనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ సినిమా కూడా.. ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ తీసేదే. బోయపాటి – బాలకృష్ణ సినిమాలోనూ ‘పొలిటికల్ పంచ్’ ఉండబోతోంది. అంతకంటే ముందే ‘జై సింహా’నీ ఎన్నికల ప్రచారానికి అనువుగా వాడుకొంటున్నారేమో అనే అనుమానం వస్తోంది. నిన్న (బుధవారం) విడుదల చేసిన ఫస్ట్ లుక్కే అందుకు నిదర్శనం. ఎన్టీఆర్ విగ్రహం, చుట్టూ ప్రజల ఆందోళన.. మధ్యలో శివాలెత్తుతున్న బాలయ్య. ఈ సీన్ మొత్తం పొలిటికల్ డ్రామానే కనిపిస్తోంది. ‘జై సింహా’కి ముందు నుంచీ ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే రేంజులోనే పబ్లిసిటీ చేస్తోంది చిత్రబృందం. అయితే సడన్గా పొలిటికల్ డ్రామా కూడా ఉండబోతోందన్న విషయం అర్థమైంది. ‘లెజెండ్’లో టీడీపీ, ఎన్టీఆర్లను గుర్తు చేస్తూ బాలయ్య పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలోనూ అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.