తెలంగాణ లో అధికార తెరాస కు ఉన్న అడ్వాంటేజ్ లలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కావడం కూడా ఒకటి అని ఇక్కడి రాజకీయ వర్గాల్లో చాల సెటైర్ లు వినిపిస్తూ ఉంటాయి. జానారెడ్డి శాసనసభలో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దాడి చేసే తీరు కాస్త మేతకగా ఉంటుందని, అయన సభలో లేని సమయంలో విచ్చల విడిగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేస్తూ ఉంటారని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రభుత్వం గురించి మెతక గా మాట్లాడే వైఖరి, ప్రాజెక్టుల విషయంలో కెసిఆర్ నిర్ణయాలనే సమర్థిస్తున్నట్లు మాట్లాడడం వంటివి గమనించిన ఎవరికైనా సరే, ఈ విమర్శలు నిజమే అనిపిస్తుంది. పైగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి జానారెడ్డి తీసుకుంటున్న ఒక నిర్ణయం ఏకంగా అయన తెరాస కోవర్ట్ లాగా కాంగ్రెస్ లో పని చేస్తున్నారా అనే అనుమానాలు కలిగించేలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం పనితీరులో దాదాపు మంత్రులతో సమానమైన ప్రయారిటీ తో అధికారం హవా నడిపించగలిగిన పదవిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఈ పదవి ప్రతిపక్ష పార్టీకే దక్కడం ఆనవాయితీ. ఈ పదవి లో ఉన్నవారు.. ప్రభుత్వం చేపడుతున్న పనుల మీద నిఘా నేత్రం వేసి ఉండడం మాత్రమే కాదు. వారి మెడలు వంచి నిలదీయడానికి కూడా అధికారం కలిగి ఉంటారు. ప్రశ్నించడమే కాదు. తప్పు పట్టి, ఇరుకున పెట్టగలిగే స్థితిలో ఉంటారు. అందుకే.. విపక్ష పార్టీలు తమలో బాగా దృఢంగా ఉండగల నాయకుడిని ఎంచుకుని, ఈ పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెడుతుంటాయి. గతంలో టీడీపీ తరపున నాగం జనార్దన రెడ్డి, మొన్నటి దాకా వైసీపీ తరపున భూమా నాగిరెడ్డి వంటి వారుండేవారు. అలా సర్కారును ఇరుకున పెట్టగలవారు ఈ పదవిలో ఉండాలి.
అయితే తాజా పరిణామాలు గమనిస్తే… ఈ పదవిని కూడా మరొక మెతక లీడర్ చేతికి అప్పగించాడు జానారెడ్డి నానా పాట్లు పడుతున్నట్లు కనిపిస్తున్నది. పీఏసీ చైర్మన్ గా గీతా రెడ్డి ని చేయడానికి అయన సీనియర్ నేత జీవం రెడ్డి ని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జీవన్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ఈ పదవిలో ఉంటే కనీసం ప్రభుత్వం గాడి తప్పకుండ కాపలా కాయగల అవకాశం ఉంటుంది. కానీ, జీవన్ రెడ్డి ని బుజ్జగించి గీతారెడ్డి చేతిలో ఆ పదవిని పెట్టడానికి జానా యత్నాలను గమనిస్తే కొత్త అనుమాణాలే కలుగుతున్నాయి. తమను ప్రశ్నించే అలవాటు లేని విపక్ష నేతను ఈ పదవిలో ఉంచేలా తెరాస స్కెచ్ ప్రకారమే జానారెడ్డి ఈ మంతనాలు చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంది. అందుకే.. అయన తెరాస కోవర్ట్ లాగా పనిచేస్తున్నారేమో అనే పుకార్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.