ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీకి సంక్లిష్టంగా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. లోపాయికారీ సహకారం అందిచండానికి.. తీసుకోవడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి కానీ..ఎన్నికల్లో కలసి పోటీ చేయడానికి ఎవరూ అంగీకరించడం లేదు. బీజేపీతో కలిసి పోటీ చేయడం అంటే.. తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకోవడం అని డిసైడ్ అయిపోయాయి. అందుకే.. బీజేపీకి మిత్రపక్షం అంటూ లేదు. ఏపీ బీజేపీ వ్యవహారాలను చూస్తున్న రామ్‌మాధవ్‌కు .. ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది. మిత్రపక్షాన్ని ఎలా అయినా… పట్టుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ.. మళ్లీ మిత్రపక్షం అయ్యే అవకాశమే లేదు. ఇక మిగిలింది.. వైసీపీ, జనసేన..! వీటిలో రామ్‌మాధవ్ ప్లాన్‌లో ఉన్నదెవరు..?
ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఇండియా టుడే పలు రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహిస్తోంది. అలా.. ఓ సదస్సును విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న రామ్‌మాధవ్… ఏపీ విషయంలో తన ఆలోచనలను వెల్లడించారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఏ పార్టీతో అయినా కలసి పని చేస్తామని ప్రకటించారు. అంటే.. పొత్తు కోసం.. వైసీపీ నేతలు ముందుగు రాలేదని…తేలిపోయింది. అందుకే… టీడీపీ, వైసీపీపై కుటుంబ, అవినీతి పార్టీలనే ముద్ర వేసేవారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. ఈ విశేషణాలేమీ.. రామ్‌మాధవ్‌కు గుర్తు ఉండి ఉండకపోవచ్చు. ఆ కుటుంబ, అవినీతి మరక లేని పార్టీ.. జనసేన అన్న అభిప్రాయంతో రామ్ మాధవ్ ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ మాధవ్.. జనసేన పేరును.. తన ఏపీ ప్రణాళికల్లో భాగంగా వెల్లడించకపోయినా.. ఉన్న ప్రత్యామ్నాయం ఆ ఒక్కటే కాబట్టి… అందరూ ఆ దిశగా ఆలోచిస్తున్నారు.
ఇటీవలి కాలంలో రామ్‌మాధవ్… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సన్నిహితమయ్యారని ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఇద్దరి మధ్య భేటీ జరిగిందని చెబుతున్నారు. ఏపీలో ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ద్వారా జరిగిన భేటీతో.. ఇద్దరూ ఓ పొలిటికల్ డీల్‌కు వచ్చారని.. ఆ తర్వాతే పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారంటున్నారు. దానికి తగ్గట్లుగానే.. పవన్ రాజకీయ వ్యవహారాలు.. మీడియా కవరేజీ కోసం.. రామ్ మాధవ్ ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన కవాతుయాత్రకు కవరేజీ ఇవ్వాలంటూ.. రామ్‌మాధవ్… టీవీ చానళ్ల యజమానులకు.. హెచ్చరికల్లాంటి సూచనలు పంపడం అప్పట్లో కలకలం రేపింది. రామ్‌మాధవ్ మాటలను బట్టి చూస్తే… జనసేనలో ఆయన మిత్రపక్షం చూసుకుంటున్నారు. కానీ.. కలసి పోటీ చేస్తారో లేదో మాత్రం క్లారిటీ రావడం లేదు. బహుశా.. వచ్చే రెండు నెల్లలో దీనిపై స్పష్టత రావొచ్చు.!