విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మకానికి పెట్టడంపై రేగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో కడప స్టీల్ పరిశ్రమ అంశం చర్చనీయాంశం అవుతోంది. అంత పెద్ద ఆస్తులు.. చరిత్ర ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తూ కొత్తగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం పెడుతుందా.. అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. కడపలో ఉక్కుపరిశ్రమ పెట్టి .. సొంత జిల్లాను పారిశ్రామికంగా ఎక్కడకో తీసుకెళ్లాలని సీఎం జగన్ తాపత్రయ పడుతున్నారు. అందుకే అధికారంలోకి రాగానే గతంలో చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీ కోసం చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని పీకేసి.. తాను సొంతంగా ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే… 2019 డిసెంబర్ 24న కొబ్బరికాయ కొట్టారు. మూడంటే మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తానని ఆయన ప్రకటించారు. అందు కోసం పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నట్లుగా కూడా చెప్పారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పారు. ఇప్పుడు ఏడాది దాటిపోయింది. అక్కడ ఉక్కు పరిశ్రమపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొద్ది రోజుల కిందట ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు అవసరమైన పర్యావరణ అనుమతుల్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అరకొర సమాచరారంతో ధరఖాస్తు చేయడంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం దరఖాస్తును వెనక్కి పంపింది.
వాస్తవానికి స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలో ఉంది. గత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ సాధ్యం కాలేదు. చివరికి బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది.. ఇక కేంద్రం ఇవ్వదన్న నిర్ణయానికి తామే సొంతంగా కట్టాలని డిసైడ్ చేసి శంకుస్థాపన చేశారు. చైనాతో పాటు వివిధ దేశాలకు చెందిన సంస్థలతో మాట్లాడుతున్నట్లుగా ప్రభుత్వం చెప్పింది కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఇప్పుడు వైజాగ్ స్టీల్స్‌ను అమ్మేస్తూండటంతో… కడప లో ఫ్యాక్టరీ పెట్టే చాన్సే లేదని తేల్చేస్తున్నారు.