ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ తన పార్టీని ప్రారంభించారు. అబ్దుల్ కలాం నివాసం నుంచి పార్టీని ప్రకటించిన ఆయన మధురై లో జరిగే బహిరంగ సభలో తన పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్నారు. అయితే ఆయన తన విధి విధానాలు అధికారికంగా ప్రకటించకపోయినా తాను కాషాయ వ్యతిరేకినని ఇప్పటికే ప్రకటించుకున్నారు. రజనీకాంత్ పార్టీతో పెట్టుకోవాలంటే తాను విధించిన ఏకైక షరతు కూడా ఇదే. రజనీకాంత్ కాషాయరంగు వదిలేసి వస్తే పొత్తు పెట్టుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన ఇదివరకే చెప్పి ఉన్నారు. అలాగే కాషాయ వ్యతిరేకి అయిన అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమై తన భావజాలాన్ని విస్పష్టంగా ప్రకటించి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ, తిరుపతి సభలలో బీజేపీని గతంలో చెండాడి ఉన్నారు.
2014లో మోడీ హవా దేశమంతా వీచినప్పటికీ తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అది పని చేయలేదు. అయితే జయలలిత మరణాంతరం కమల పార్టీ బిజెపి తన పవనాన్ని తమిళనాట కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అది సఫలీకృతం కానప్పటికి తన ప్రయత్నాలు తాను చేస్తుంది. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ విధి విధానాలు చూస్తుంటే కమలం పార్టీ కి తమిళనాట గడ్డుపరిస్థితి కల్పించడమే ధ్యేయం గా కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో బిజెపి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించిన పవన్ కళ్యాణ్, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడా తాను కూడగడతానని చెప్పి ఉన్నాడు.
ఈ లెక్కన తమిళనాట కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్, బిజెపి వ్యతిరేక ధోరణిని ప్రాచుర్యం చేసి 2019లో దక్షిణ భారతదేశంలో కమల పవనానికి, అదేనండి మోడీ హవా కి బ్రేకులు వేస్తారా అన్నది చూడాలి.
నిజానికి కమల్ హాసన్ కి కానీ పవన్ కి కానీ (ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం) పెద్ద పార్టీల తో తలపడేంత నిర్మాణం లేనప్పటికీ, వీరు బిజెపి కి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు ప్రజలకి “రీచ్” అవుతాయి కాబట్టి ఆ మేరకి బిజెపి కి తప్పక నష్టం చేస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
– జురాన్