ఊపిరి సినిమా వచ్చేసింది. జనాలు హిట్ అనే ముద్ర వేసేశారు. సినిమా చూస్తున్నంత సేపూ… అందరికీ ఎన్టీఆరే గుర్తొస్తున్నాడు. దానికీ ఓ కారణం ఉంది. కార్తి పాత్ర ఎన్టీఆరే చేయాల్సింది. అంతా ఓకే అనుకొన్న సమయంలో ఎన్టీఆర్ డ్రాప్ అయ్యాడు. కాల్షీట్లు సర్దుబాటు చేయలేను అని తప్పుకొన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ప్లేసులోకి కార్తి వచ్చాడు. ఇప్పుడు ఊపిరి సినిమాకే కార్తి ఊపిరి అయిపోయాడు.
సినిమా చూసొచ్చిన వాళ్ల ఫీలింగ్ ఒక్కటే. ఒకవేళ కార్తి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తే ఎలా ఉండేది? అని. కార్తి ఇమేజీ, అతని పెర్‌ఫార్మ్సెన్స్ రేంజ్ వేరు. ఎన్టీఆర్ స్టార్ డమ్ వేరు. ఎన్టీఆర్ కూడా బీబత్సంగా నటించగలడు. కానీ శీను పాత్రలో ఎందుకో కార్తికి మించిన ఆప్షన్ లేదనిపిస్తోంది… అది నిజం.
అదే పాత్ర ఎన్టీఆర్ కి ఇచ్చుంటే ఏ రేంజులో చేసుండే వాడో తెలీదు గానీ… ఇప్పుడున్న ఈ ఫ్లేవర్ వచ్చేది కాదు. డౌన్ టు ఎర్త్ పాత్ర, మేకప్ ఏమాత్రం లేదు.. చాలా లో ప్రొఫెల్, ఒక్కటంటే ఒక్క పాట, ఫైటు జోలికి వెళ్లలేదు.. ఇలాంటి క్యారెక్టర్లో ఎన్టీఆర్‌ని ఊహించడం కష్టమే. అలాగని వంశీ ఖాళీగా కూర్చునే వాడు కాదు. ఎన్టీఆర్ కోసం ఏదోటి మార్పు చేసేవాడు. ఆ మార్పు ఊపిరిని ముంచే ప్రమాదమూ లేకపోలేదు. మొత్తానికి ఊపిరి నుంచి… ఎన్టీఆర్ డ్రాప్ అవ్వడం మంచిదే అయ్యిందన్నది సినీ విశ్లేషకుల మాట. అందుకే ఊపిరి గురించి ఎవరు మాట్లాడుకొన్నా.. ఎన్టీఆర్ నీ గుర్తు తెచ్చుకొంటున్నారు.