మన పురాణాల్లో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడి కథ ఉంటుంది! తన చేయి ఎవరిపై పడితే వారు మరణించేలా వరం పొందాడు. ఆ మదంతో విర్రవీగాడు. కానీ, ఒకరోజున తన చేతిని తన తలపైనే పెట్టుకుని భస్మం అయిపోయాడు. (కత్తి మహేష్ స్వయంకృతం గురించి మాట్లాడుకునే ముందు రాక్షసుడితో పోల్చాలన్న ఉద్దేశం కాదు.కేవలం సందర్భోచిత ప్రస్థావనగా మాత్రమే దీన్ని పరిగణించగలరు.)
వివాదాలే పెట్టుబడిగా కొంతమంది కెరీర్ ప్లాన్ చేసుకుంటారు! కత్తి మహేష్ ఇన్వెస్ట్మెంట్ అచ్చంగా అదే. దీంతోపాటు, అప్పట్లో బిగ్ బాస్ షో కత్తి మహేష్ కి కొంత పాపులారిటీ తెచ్చింది. సినిమా రివ్యూలు బాగానే చేస్తారనే కొంత గుర్తింపూ ఉంది. ఆ తరువాత, పవన్ కల్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో కత్తి మాంచి మైలేజ్ తెచ్చుకున్నారు. ఇంకేముంది, అక్కడి నుంచీ టీవీ ఛానెళ్లలో అన్ని రంగాలకు సంబంధించి విశ్లేషణలూ చేయడం మొదలుపెట్టేశారు! అయితే, పవన్ ఫ్యాన్స్ తో వివాదంలో అభిమానుల తరఫు నుంచి కొంత అత్సుత్సాహం ఉంది కాబట్టి, ఒక స్థాయిలో కత్తిదే పైచేయి అన్నట్టుగా అనిపించింది. కానీ, అక్కడి నుంచే తనని తాను అతిగా అంచనా వేసేసుకున్నట్టున్నారు కత్తి..!
ఇలా టీవీ ఛానెల్స్ లో డిబేట్లు, అన్నీ తనకే తెలుసు అన్నట్టుగా గారిడీ చేయగలిగే వాక్చాతుర్యం, సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హడావుడి, ఏది మాట్లాడితే వార్త అవుతుందీ, టీఆర్పీల వేట కోసం ఛానెల్స్ ఎగబడతాయనే ఒక అంచనా.. ఇవన్నీ కలిసి కత్తి మహేష్ ని ఒక బడా రాజకీయ పార్టీ తరఫున చోటా నాయకుడిగా స్థానం పొందే స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో శ్రీరాముడు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది! ఫలితం… కత్తి రాజకీయ కలలు ఒక్కసారిగా భూస్థాపితం అయిపోయాయి..!
కత్తి మహేష్ వెనక ప్రోత్సాహకంగా నిలుస్తోందనే విమర్శల్ని ఎన్నడూ ఖండించని వైకాపా కూడా… మహేష్ తో మాకేం సంబంధం లేదని తెగేసి చెప్పేసింది. కత్తి నోరు జారగానే.. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి… కత్తి తాజా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం చినికి చినికి గాలీ వానగా మారి.. నగర బహిష్కరణ వరకూ దారి తీసింది. ఇకపై, పెద్ద రాజకీయ పార్టీలేవీ కత్తిని పరోక్షంగా కూడా తమవైపు ఉన్నాడనే అనుమానాలు రానీయ్యవు! బీఎస్పీలాంటి చిన్నాచితకా పార్టీలేవైనా కత్తి మహేష్ ను చేరదీస్తాయేమో తప్ప… తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ స్ట్రీమ్ పార్టీలు ఆయన జోలికి వెళ్లవు. ఇకపై, టీవీ ఛానల్స్ కూడా కత్తిని చర్చలకు ఆహ్వానించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని స్వయంగా తెచ్చుకున్నారు. అన్నిటికీమించి, రాజకీయంగా తనకంటూ అందివస్తున్న అవకాశాలను.. మొగ్గలోనే స్వయంగా తుంచేసుకున్నారు కత్తి మహేష్.