తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోనే ఉన్నట్లుగా ఉన్నారు. ఇంత కాలం పట్టించుకోని సమస్యలను అసెంబ్లీ వేదికగా పరిష్కరిస్తున్నట్లుగా ప్రకటించేస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై చాలా విమర్శలు చేశారు కానీ.. ఈ మధ్యలో అనేక హామీల ను కూడా ప్రస్తావించారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను రెండేళ్ల క్రితం కేసీఆర్ ఉద్యోగాల నుంచి తొలగించారు. వారు అవినీతికి పాల్పడుతున్నారని తేల్చేసారు. 7,651మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కేసీఆర్ నిర్ణయం కారణంగా ఉద్యోగం కోల్పోయారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత కేసీఆర్ అనూహ్యంగా వారికి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాదు జీతాలు కూడా పెంచుతామన్నారు.రెండేళ్లుగా పట్టించుకోని వారిని ఇప్పుడే ఎందుకు గుర్తుచేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వారికి ఎలాంటి పని చెప్పని సీఎం కేసీఆర్ వారి అసంతృప్తిని కూడా చల్లార్చేపని చేశారు. వీఆర్ఏలను ఇక నుంచి ఇరిగేషన్ శాఖలో కలపనున్నట్లు చెప్పారు. వీఆర్ఏలను లష్కర్ పోస్టులకు తీసుకుంటామని.. వారికి పే స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. వీఆర్ఏలలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారున్నారని.. వారందరికీ ప్రమోషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సెర్ప్, ఐకేసీ, మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఇక చాలా కాలంగా హామీగానే ఉండిపోతున్న జీవో 111ను త్వరలోనే ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉందని.. తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడం లేదు కనుక.. జీవో ఎత్తివేస్తామన్నారు. ఆ జీవో పరిధిలో పదిశాతం మాత్రమే శాశ్వత నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడం లేదు. భవిష్యత్‌లో ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. 111 జీవో అర్థ రహితం, రిడెండెంట్ కూడా అయిపోయింది కాబట్టి తీసేస్తదామన్నారు. అయితే ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న అభిప్రాయం ఉంది. ఇక ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ వైద్య విద్యార్థుల ఖర్చును కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చేశారు.
ఎంత వీలైతే అంత త్వరగా ముందస్తుకు వెళ్లాలన్నఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఆయన ప్రకటనలను విపక్ష నేతలు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ లేని ఇన్ని హామీలను ప్రకటిస్తాున్నారని.. అమలు చేసేలోపే ఎన్నికలకు వెళ్తారని అనుమానిస్తున్నారు.