చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఏపీని కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఎలా ఉన్నా.. రాజకీయంగా మాత్రం ఆత్మీయుడు, మిత్రుడు అయిన జగన్ సీఎంగా ఉన్నా కేసీఆర్ ఎందుకు ఆంధ్రా గురించి తక్కువగా మాట్లాడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో మూడు రాజధానులను కేసీఆర్, కేటీఆర్ సమర్థించారు. ఏపీలో పాలన బాగా సాగుతుందనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో చీకట్లు అలుముకున్నాయని.. నాశనం అయిపోయిందని.. కానీ తెలంగాణ మాత్రం బంగారుమయం అయిందన్నట్లుగా చెబుతున్నారు. పైగా ” ఏపీలోనూ టీఆర్ఎస్ను పోటీ చేయమని అంటున్నారని.. గెలిపించుకుంటామని చెబుతున్నారని ” అంటున్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు.. తాము ఏపీకీ ఎందుకు వెళ్లకూడదని.. తాము ఏపీ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించడమే కాకుండా..వేలు కూడా పెట్టారు. వైసీపీకి బహిరంగ మద్దతు పలికారు.
ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వానికి టీఆర్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉంది. గతంలో చంద్రబాబు హయాంలోనే .. ఏపీలోని అంశాలకు తెలంగాణలో కేసులు పెట్టి చేయాల్సిన రచ్చ అంతా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఏపీని ఎందుకు తక్కువ చేస్తున్నారన్నది రాజకీయవర్గాలకూ అంతు బట్టకుండా ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు కూడా . అందుకే కేసీఆర్ విమర్శలపై ఎవరూ ఎక్కువగా స్పందించవద్దని వైసీపీ హైకమాండ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్కు ఎదురు గాలులు వీస్తున్నాయని.. ఈ కారణంగా మళ్లీ ఏపీని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్లనే తెలంగాణ బాగు పడిందని. .ఏపీ చెడిపోయిందని చెప్పాలనుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.