కాంగ్రెస్ – టీడీపీ కలయిక… తెలుగుదేశం రాజకీయాల్లో కచ్చితంగా ఒక మలుపే. ఈ కలయికకు కారణం దేశాన్ని కాపాడాలన్న నినాదంతోపాటు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా టీడీపీ చూపిస్తుంది. సరే, రాజకీయంగా దీని ప్రభావం టీడీపీపై ఎలా ఉంటుందనేది వేరే చర్చ! అయితే, ఇక్కడ మరో ముఖ్యాంశం ఏంటంటే… కేసీఆర్ కలలుగన్న ఫెడరల్ ఫ్రెంట్ పరిస్థితి ఏంటనేది..? నిజానికి, అందరికంటే ముందు ఆయనే కాంగ్రెసేతర భాజపాయేతర మూడో ప్రత్యామ్నాయం జాతీయ రాజకీయాల్లో అవసరమని నినదించారు. జాతీయ స్థాయిలో రైతుల్ని కాపాడుకోవాలన్నారు. ఆ తరువాత, దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర వివక్షకు గురౌతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అనుభవంతో… జాతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, దేవెగౌడ.. ఇలా కొంతమందితో కేసీఆర్ చర్చలు జరిపారు. కానీ, ఆ తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడటం, మరీ ముఖ్యంగా తెలంగాణలో ముందస్తుకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధం కావడం, దీన్లో భాగంగా కేంద్రంలో మోడీ సర్కారుతో కొన్ని విషయాల్లో చాలా అవసరాలు ఉండటం… పరిణామాలు ఏవైతేనేం, జాతీయ రాజకీయాలు అనే ఆలోచనను కేసీఆర్ పక్కన పెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లడం వెనక కేసీఆర్ ది జాతీయ రాజకీయ వ్యూహమనీ అనుకున్నారు. వాస్తవానికి తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. లోక్ సభ ఎన్నికలు వచ్చేలోగానే రాష్ట్రంలో ఎన్నికలైపోతే… ఆ తరువాత, తాను తీరిగ్గా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేద్దామని అనుకుంటున్నారనే విశ్లేషణలూ వచ్చాయి. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల పార్టీలను ఏకం చేసే పనిలో ఉండొచ్చనుకున్నారు!
కానీ, ఇప్పుడా బాధ్యత మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు! దేశాన్నీ ప్రజాస్వామ్యాన్ని భాజపా నుంచి కాపాడుకోవాలనే బాధ్యతలో భాగంగా… ఇతర పార్టీలతో తాను మాట్లాడుతానంటూ, మమతా బెనర్జీ టచ్ లో ఉన్నారనీ, ఇతర నేతలతో కూడా త్వరలో మాట్లాడబోతున్నానని చంద్రబాబు ఢిల్లీలో చెప్పారు. అయితే, భాజపాని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తాయా అనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. కానీ, జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి.. ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమైనా, ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉండాల్సిందే అనే అభిప్రాయమూ ఆ మధ్య… అంటే, భాజపాయేతరం, కాంగ్రెసేతరం అని కేసీఆర్ నినదించిన క్రమంలో తీవ్ర చర్చకు వచ్చింది.
తాజా పరిణామాలు చూస్తుంటే, కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ కలలుకు దాదాపు ఫుల్ స్టాప్ పడ్డట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇతర పార్టీలను కూడగట్టే అవకాశాన్ని కోల్పోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకోటి… భవిష్యత్తులో కేసీఆర్ భాజపా వైపు మొగ్గు చూపే అవకాశాలూ తక్కువే… ఎందుకంటే, రాష్ట్రంలో మజ్లిస్ తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, ఆ ధైర్యం చెయ్యలేరు. అలాగని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి మద్దతూ ఇవ్వలేరు. ఎందుకంటే రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ప్రత్యర్థి కాబట్టి..!