ఎత్తుకు పై ఎత్తు వేయాలనుకునే విషయంలో కేసీఆర్ ముందుంటారు. కేసీఆర్ గురించి తెలిసిన ఎవరికైనా ఇందులో సందేహం ఉండదు. అది అవుతుందా… లేదా… అన్నది తర్వాత. కేసీఆర్ మాత్రం అలాంటి ఆలోచనల్లో ముందుంటారు.
తన బిడ్డ కవితకు లిక్కర్ కేసు ఏనాటికైనా ప్రమాదం అనేది కేసీఆర్ ఎప్పుడో ఊహించిందే. రాజకీయ సమీకరణాల్లోనూ లిక్కర్ కేసుకు వెయిటేజ్ ఎక్కువే ఉంటుందని కూడా తెలుసు. అందుకే ఎక్కడో దొరికిన ఓ సన్నని తీగ పట్టుకొని, లిక్కర్ కేసుకు చెక్ పెట్టాలనుకున్నారు. కానీ, అవతలి వారి బలం మన బలం కన్నా తక్కువ అని ఊహించటమే అసలుకు ఎసరొచ్చినట్లు కనపడుతోంది.
అవును… కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉండగానే, తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకు వచ్చింది. బీజేపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లబోతున్నారు, పైలెట్ రోహిత్ రెడ్డి సహా నలుగురితో మంతనాలు కొనసాగుతున్నాయి, నందు అనే మధ్యవర్తితో కథ నడుస్తుందని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో అసలు విషయం బయటకు పొక్కగా, ఇందులో బీఎల్ సంతోష్ వంటి పెద్ద నేతలున్నారని తెలియగానే దీన్ని ముందు పెట్టి లిక్కర్ కేసు నుండి కవితను బయటపడేయాలనుకున్నారని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాధాకిషన్ రావు విచారణలో ఇదంతా చెప్పారని, ఓ డీసీపీతో కలిసి ఐజీ ప్రభాకర్ రావు అధునాతన పరికరాలు కొనుగోలు చేసి… ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రికార్డు చేసినట్లు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కేసీఆర్ కూడా తాను పోలీసులను పంపానని… బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలనుకున్నట్లు ఓపెన్ గానే అంగీకరించారు. అంటే రాధాకిషన్ రావు విచారణలో ఒప్పుకున్నట్లు బయటకు వస్తున్న సమాచారం, కేసీఆర్ చెప్పిన సమాచారం కూడా ఒకే అంశాన్ని బలపరుస్తుంది.
కానీ, బీఎల్ సంతోష్ బలం వేరు… కేసీఆర్ బలం వేరు. అందుకే బీఎల్ సంతోష్ కు వేద్దామనుకున్న వల కుదరలేదని, పైగా కేసీఆర్ కు తమ రుచెంటో చెప్పాలనుకున్న దృఢ నిర్ణయానికి అది ఆజ్యం పోసి ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.