తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న థర్డ్ ఫ్రెంట్ గురించి బాగానే చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ మెచ్చుకున్నారనీ, డిఎంకే ఆసక్తిగా ఉందనీ, మహారాష్ట్ర నుంచి ఫోన్లు వచ్చాయనీ.. ఇలా కేసీఆర్ చాలానే చెప్తున్నారు. ఈ మద్దతుదారుల విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే, భాజపా, కాంగ్రెసేతర కూటమికి కేసీఆర్ నాయకత్వం వహించడంపై ఢిల్లీలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా దీనిపై స్పందించినట్టు తెలుస్తోంది.
మూడో ఫ్రెంట్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయనే అంశాన్ని తెలంగాణకు చెందిన కొంతమంది భాజపా నేతలు అమిత్ షా ముందు ప్రస్థావించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారనీ, ఆయన పిలుపునకు భాజపా సహజ వ్యతిరేకుల నుంచి స్పందన బాగానే వస్తోందనే అంశాన్ని కొంతమంది కమలనాథులు అమిత్ షాకు వివరించే ప్రయత్నం చేశారట. దానికి అమిత్ షా స్పందన ఏంటే తెలుసా.. ఈ మాట వినగానే ముందుగా ఓ చిరునవ్వు నవ్వారట..! ‘కేసీఆర్ ని ఢిల్లీ మీద దృష్ట పెట్టనీయండి, మనం తెలంగాణ మీద దృష్టి పెడదాం’ అంటూ నర్మగర్భంగా స్పందించినట్టు విశ్వసనీయ సమాచారం.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బాగా బిజీ అయిపోతే, తెలంగాణలో భాజపా విస్తరణకు మరింత సులువు అవుతుందనేది అన్యాపదేశంగా అమిత్ షా చెప్పిన మాటగా అర్థమౌతోంది. నిజానికి, తెలంగాణలో పార్టీని విస్తరింపజేయాలన్న లక్ష్యం అమిత్ షాకి ఎప్పట్నుంచో ఉంది. ఇకపై ఆయన తరచూ తెలంగాణకు వస్తారనే ప్రకటనలు ఆ మధ్య టి. భాజపా నేతలు చేసేవారు. అధికార పార్టీ నుంచి కొంతమందిని ఆకర్షించామనీ, అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి చేరిక ఉంటుందంటూ రాష్ట్ర నేతలు కొన్ని ప్రకటనలు చేశారు. అంతేకాదు, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా తెలంగాణకు అమిత్ షా పంపించారని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. కాకపోతే, అమిత్ షా రాష్ట్రానికి రాకపోవడంతో ఆ చర్చ కొన్నాళ్లుగా పక్కకు వెళ్లింది. అయితే, కేసీఆర్ ఢిల్లీపై దృష్టి పెడుతున్న ఈ తరుణంలో, అమిత్ షా వ్యూహాల అమలు మొదలుపెట్టే అవకాశం ఉందనే అనిపిస్తోంది. అయితే, సంస్థాగతంగా రాష్ట్రంలో తెరాస చాలా బలంగానే ఉంది. కానీ, కేంద్రంలో అధికారం భాజపా చేతిలో ఉంది. ఇంకా చెప్పాలంటే అమిత్ షా చెప్పుచేతల్లో బాగానే ఉంది కదా. కాబట్టి, రచ్చ గెలవాలన్న కేసీఆర్ కోరిక, ఇంట ముంచనుందా అనే అనుమానాలు కొంతమందిలో కలుగుతున్నాయి.